ప్రభుత్వానికి షాక్కిచ్చిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు

 

బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోరుతూ నిరవధిక సమ్మెకు సిద్దం అవడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో కొద్ది సేపటి క్రితం జరిపిన చర్చలు సఫలమయినందున విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను ఈ నెల 16 వరకు వాయిదా వేసుకొన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ, విద్యుత్ ఉద్యోగులు మాత్రం ముఖ్యమంత్రి కోరిక మేరకు తమ నిరవధిక సమ్మెను వాయిదా వేసుకొన్నామని, కానీ నేటి అర్ధ రాత్రి నుండి 72గంటల సమ్మె చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే ఈ సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్రం పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టిన మరుక్షణం నుండే తాము నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు స్పష్టం చేసారు.

 

సమ్మె వాయిదా పడిందని ఊపిరి పీల్చుకొన్న ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతల ఈ ప్రకటనతో ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఉద్యోగులు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులందరూ తమ అధికారిక మొబైల్ ఫోన్లను, సిం కార్డులను తమ ఉన్నతాదికారులకు వాపసు చేసారు.

 

ఇంతవరకు అన్నిప్రభుత్వ సంస్థల ఉద్యోగులు చేసినప్పుడు ఏర్పడే ఇబ్బందులను ప్రజలు ఎలాగో ఎదుర్కొంటున్నపటికీ, ఈ రోజు నుండి మొదలయ్యే విద్యుత్ ఉద్యోగుల 72గంటల సమ్మెతో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రమంతటా ఒకదానికొకటి అనుసంధానమయి ఉండే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలలో ఏ చిన్నలోపం ఏర్పడినా వాటిని సరిదిద్దేందుకు ఉద్యోగులు అందుబాటులో లేకపోతే మొత్తం గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మరి ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్ ఉన్నతాధికారులు అధిగమించడం నిజంగా ఒక అగ్నిపరీక్షేనని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో మళ్ళీ రేపు మరోమారు చర్చలు జరిపి, వారి చేత వెంటనే సమ్మె విరమింపజేస్తే తప్ప యావత్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పదు.