మా ప్రాణాలకు లెక్కలేదా..వెలగపూడిలో కార్మికుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అక్కడ పనిచేస్తున్న కార్మికులు భగ్గుమన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేందర్ అనే కార్మికుడు కాంక్రీట్ మిల్లర్‌లో పడి దుర్మరణం పాలయ్యాడు. కళ్లేదుటే తమ తోటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో కార్మికులు తట్టుకోలేకపోయారు.

 

శరవేగంగా సాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆందోళనకు దిగారు. దేవేందర్ మృతదేహన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దేవేందర్ కుటుంబానికి న్యాయం చేసిన తర్వాతే మృతదేహన్ని తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అంబులెన్స్‌కి వారు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా ఎల్‌అండ్‌టీ కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.