ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరంలేదు.. మంత్రి చౌధరి


ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం ఏపీ ప్రత్యేక హోదా పై మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ఏం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి వారి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని, నీతి ఆయోగ్ కూడా ఇదే చెప్పిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ.. విభజన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నాము.. వెనుకబడిన జిల్లాలకు రెండేళ్లలో రూ.750 కోట్లు ఇచ్చామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రెండేళ్లలో రూ.2050 కోట్లు ఇచ్చామన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడలలో విమానాశ్రయాల విస్తరణకు భూసేకరణ జరుగుతోందని చెప్పారు. ఏపీకి ఆర్థిక సాయంపై నీతి అయోగ్ పరిశీలిస్తుందని చెప్పారు.

 

దీంతో కేంద్ర వైఖరిపై ఇప్పుడు ఏపీ ప్రజలతో పాటు.. టీడీపీ సహా అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. అంతేకాదు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసలను చేసేందుకు గాను.. ఉద్యమాల హోరు వినిపించేందుకు అప్పుడే సమాయత్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రజా సంఘాలు చర్చల్లో మునిగిపోయాయి. అయితే కలిసి ఉద్యమిద్దామని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నప్పటికీ.. ఆయా పార్టీలు మాత్రం ఒంటరిగానే ఉద్యమించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడిగానైనా, విడివిడిగానైనా... ‘హోదా’ కోసం ఏపీలో ఉద్యమాలు హోరెత్తడం మాత్రం ఖాయమేనని తెలుస్తోంది.