రాజీవ్ శర్మ వక్రీకరించి మాట్లాడుతున్నారు.. అచ్చెన్నాయుడు

ఇప్పటికే ఓటు నోటు కేసు వ్యవహారంపై రెండు రాష్ట్రాలు కొట్టుకుచస్తుంటే మళ్లీ ఇప్పుడు షెడ్యూల్ 10 తెరపైకి వచ్చింది. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే రోజుకో వివాదంపై రెండు రాష్ట్రాలు తిట్టిపోసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ 10 గురించి వాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు తమ రాష్ట్రానికే చెందుతాయని అన్నారు. ఇప్పుడు రాజీవ్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. షెడ్యూల్ 10 గురించి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ క్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ లో 103 ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేసుకున్నామని.. ఏపీకి వీటిలో వాటా ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్ 10 ప్రకారం హైదరాబాద్ పై తెలంగాణతో పాటు ఆంధ్రాకి కూడా సమానంగా హక్కు ఉందని.. పదేళ్ల రాజధాని గా ఉన్న హైదరాబాద్ పై పదినిమిషాలు కూడా హక్కు వదులుకోమని తేల్చిచెప్పారు. ఏపీ ఉద్యోగులను వెళ్లిపోమని చెప్పడానికి వారేవరని.. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ ను విడిచి వెళ్లరని అక్కడే పని చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని.. గవర్నర్ సెక్షన్ 8 పై నాన్చకుండా వెంటనే అమలు చేస్తే మంచిదని సూచించారు.