ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్.. లబ్ధిదారులను వాలంటీర్లు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్న
posted on: May 6, 2022 5:54PM
ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గ్రామాల్లో వాలంటీర్లదే ఇష్టారాజ్యంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తినా జగన్ సర్కార్ ఖాతరు చేయలేదు. ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తూ ప్రతి విషయంలోనూ వాలంటీర్లకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. చాలా చోట్ల అధికారులు, ఎమ్మెల్యేల కంటే వాలంటీర్ల పెత్తనమే చెల్లుతోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి అన్ని విషయాలలోనూ వాలంటీర్లదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ కక్షతో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తమకు నిలిపివేశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన ఏపీ హై కోర్టు వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించింది. అసలు లబ్ధిదారుల ఎంపిక వాలంటీర్లు ఎలా చేస్తారని నిలదీసింది. అలాగే వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ కదా..డబ్బులెలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఏడుగురు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటనీ నిలదీసింది. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని పేర్కొంది. అఫడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇలా ఉండగా వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధతపై తొలి నుంచీ సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే జగన్ కుట్ర పూరితంగా సమాంతర వ్యవస్థను తీసుకువచ్చారని రాజ్యాంగ నిపుణులు అప్పట్లోనే ఆరోపించారు. ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉండగా వారిని కాదని సంక్షేపథకాల పంపిణీకి ఎవరి నియంత్రణ లేని, చట్టబద్ధత లేన వాలంటీర్ వ్యవస్థను సమాంతర వ్యవస్థగా ఏర్పాటు చేయడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు.
అలాగే వాలంటీర్ లుగా ప్రభుత్వం ఉద్యోగాలిచ్చామని ఘనంగా చెప్పుకుంటున్నదనీ, కానీ ప్రభుత్వమే స్వయంగా కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించి లక్షలాది మంది చేత వాలంటీర్ల పేరుతో వెట్టి చేయిస్తున్నదని హక్కుల సంఘాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల సర్వీసు నిబంధనల గురించి, లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వారికి గల అర్హతల గురించి ఏపీ హైకోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






