ఏపీ మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు అక్షింతలు!?

posted on: Sep 16, 2025 4:33PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో పదే పదే వాయిదాలు కోరుతున్న మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద పదివేల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది. 

ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణ  మండలి చైర్మన్ మెషేన్ రాజు న్యాయవాది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయమేంటంటే.. జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే కారణంతో 2024 నవంబర్‌లో ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కె. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు. నెలలు గడుస్తున్నా, తన రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడంతో  జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు.

తన రాజీనామా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఇప్పటికే చైర్మన్ న్యాయవాది కోరిక మేరకు పలుమార్లు వాయిదా వేసినా  కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఛైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...