అమ్మో ఒకటో తారీకు!.. పింఛన్లు, వేతనాలూ చెల్లించేదెలా?

జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆ సర్కార్ ఆర్థిక అరాచకత్వం కారణంగా తెలుగుదేశం కూటమి చిక్కులు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఎన్ని సమస్యలున్నా అన్న మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీకే పించన్ల పంపిణీ, వేతనాల చెల్లింపులు చేస్తున్నా.. అమ్మో ఒకటో తారీకు అన్న బెంగ మాత్రం తప్పడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత తొలి నెలలో చెప్పినట్లుగానే అరియర్స్ తో సహా పింఛన్లు చెల్లించింది. అలాగే ఏ అవాంతరాలూ లేకుండా ఉద్యోగుల వేతనాలను కూడా వాటి ఖాతాలో వేసేసింది. వలంటీర్లతో పని లేకుండా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించింది. 

ఇక ఇప్పుడు ఆగస్టు ఒకటో తేదీ రాబోతోంది. ఆగస్టు 1నే పించన్ల పంపిణీ పూర్తికి చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ ఆర్థిక శాఖ నిధుల కొరతతో సతమతమౌతోంది. అప్పో సొప్పో చేసి ఈ నెల పించన్లు, వేతనాల పంపిణీని గట్టెక్కించేసినా మళ్లీ ఒకటో తారీకు వచ్చే సరికి మళ్లీ అప్పుల కోసం వెతుకులాట తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెలా అమ్మో ఒకటో తారీకు అనుకుని బెంబేలు పడే స్థితిలో ఉంది. పింఛన్లు వేతనాలు సరే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా నిధులు అవసరం.  ఫించన్లు,జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మల్లగుల్లాలు పడుతోంది.  67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి.ఆగస్టు నెల  సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక ఫించన్లకు, ఉద్యోగులజీతాలు ,రిటైర్ ఉద్యోగుల ఫించన్లులకు చెల్లించాల్సిన 5వేల కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు. 
అధికారంలోకి వచ్చి 50  రోజులైనా గ్యారెంటీలు అమలు పై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెబుతున్నది.ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ప్రతి నెలా ఆర్టీసీకీ రూ.250కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.ఇక అన్న క్యాంటిన్లు అన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.183 క్యాంటిన్ 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తున్నది.
సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77లక్షల రాళ్లను తొలగించాలంటే రూ.15కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. జగన్ ఫోటో లపిచ్చితో రూ.700కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది.ఇది కాక విశాఖలో 500కోట్లతో రుషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. అలాగే విశాఖలో  ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగిన తప్పులు,అవకతవకలు, ప్రజా ధనం స్వాహ వెలికితీయడానికే సమయం సరిపోవటంలేదు. రోజుకో కుంభకోణం బయట పడుతోంది. మరో పక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.  రోజువారీ ఖర్చులతో పాటు గ్యారెంటీల అమలు చేయాలంటే అప్పుచేయక తప్పదు.అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని  తెలుగుదేశం కూటమి ఎన్నికలలో  చెప్పింది. అయితే అభివృద్ధి, దానిఫలాలు వెంటనే రావు.  అభివృద్ధి పనులు జరగాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తరువాత వాటి ఫలాలు వస్తాయి. సంపద సృష్టి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కు ఆర్థిక కష్టాలు తప్పవు.  వచ్చే నెలలో అమ్మ ఒడి, రైతు భరోసా చెల్లించాల్సి ఉంది.స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వరినాట్లు కూడా మొదలయ్యాయి.ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయించాలి. కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంది. మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రశ్న. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికీ నిధుల కొరత లేకుండా చూస్తామని చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ పట్టాలెక్కిస్తామంటున్నారు.  మొత్తం మీద కొంత కాలం పాటు ఏపీకి ఆర్థిక ఇక్కట్లు తప్పవని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu