ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ నివేదిక? వైసీపీ వర్గాల్లో కాక..

posted on: Nov 10, 2021 10:10AM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే స‌ద‌స్సుకు హాజ‌రయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సమావేశంలో భాగంగా రాష్ట్రపతితో ఆయన సమావేశమవుతారు. అయితే ప్రెసిడెంట్ సదస్సు కోసమే ఏపీ గవర్నర్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ హరిచందన్ నివేదిక ఇస్తారనే చర్చ జరుగుతోంది. 

ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం వారం అప్పులు చేస్తేనే కాని పాలన సాగే అవకాశాలు కన్పించడం లేదు.  ఏపీలో పెరిగిపోతున్న అప్పుల విష‌యం మీద  జాతీయ మీడియాలో విప‌రీతంగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు చాలా సార్లు ఫిర్యాదు చేశాయి. రూల్స్ కు విరుద్ధంగా తీసుకువస్తున్న అప్పులను కట్టడి చేయాలని కోరాయి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గంపుపైనా రాజకీయ రచ్చ సాగుతోంది.

ఇక ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు జిల్లా పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. చంద్ర‌బాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి మ‌రీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మ‌రీ జ‌గ‌న్ మీద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశాంతి పెరుగుతోంద‌ని కాబ‌ట్టి ఆర్టికల్ 356ను పెట్టి ఏపీలో వెంట‌నే రాష్ట్రపతి పాలన విధించాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. 

ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చంద్రబాబు రాష్ట్ర‌ప‌తిని కలిసి చేసిన ఫిర్యాదు మీద కూడా గ‌వ‌ర్న‌ర్ తో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేసిన దాడుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. పెరిగిపోతున్న అప్పుల మీద అటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ప‌లు సార్లు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉంది. గ‌తంలో అప్పులు తెచ్చుకోవ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం గవర్నర్ పేరును చేర్చ‌డంపై గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించే ఛాన్స్ ఉంది. మొత్తంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...