హైదరాబాద్ లో ఉంది.. మరి ఏపీలో ఎక్కడ?

 

ఈ మధ్య కాలంలో ఏ చిన్న విషయానికైనా ధర్నాలు చేయడం కామన్ అయిపోయింది. మరి అలాంటి ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తే అటు అధికారులకూ.. ఇటు ప్రజలకూ ఇబ్బందే. అందుకే గతంలో దీని గురించి ఆలోచించే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని భావించి అందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఏర్పాటుచేశారు. అయితే అది అప్పటి సంగతి.. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది.. ఎపీలో కూడా ధర్నాలు ఎక్కువయ్యాయి. మరి ఏపీకి కూడా ధర్నా చౌక్ ఉండాలి కదా.. ఇప్పుడు దీని గురించి కసరత్తు జరుగుతుంది. మొన్నటి వరకూ అయితే విజయవాడలోని బందరు రోడ్డులో సబ్ కలెక్టరేట్ ఎదుట విక్టోరియా మ్యూజియం ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి ఉంది.

కానీ ఎప్పుడైతే చంద్రబాబు పాలన విజయవాడ నుండి పాలించడం మొదలు పెట్టారో.. అప్పుడు సీఎం క్యాంపు కార్యాలయాన్ని జల వనరుల శాఖ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ విధించడంతో బందరు రోడ్డు ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలకు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ కసరత్తు చేపట్టింది. అంతేకాదు సీఎం క్యాంప్ కార్యాలయానికి దూరంగా ట్రాఫిక్ సమస్య తలెత్తని చోట ధర్నా చౌక్ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ కు వెళ్లే రోడ్డుకు బిఆర్ టిఎస్ రోడ్డుకు మధ్య ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ధర్నా చౌక్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.