జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చురకలు

 

వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంట రుణాల మాఫీ అంశాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకొని అధికార తెదేపాపైకి గురిపెడుతుంటే, తెదేపా కూడా సరిగ్గా అదే అంశంతో వైకాపాపై ఇరుకున బెట్టే ప్రయత్నం చేసింది. ఈ అంశాన్ని అందిపుచ్చుకొన్న వైకాపా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంది.

 

అయితే వారి కార్యక్రమానికి సరిగ్గా 24గంటల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.50,000లోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1.50లక్ష వరకు రుణాలను రెండు దశలలో మాఫీ చేయబోతున్నట్లు తేదీలతో సహా ప్రకటించడంతో, రుణాల మాఫీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రజలలో నిలదీద్దామనుకొన్న వైకాపా కంగుతింది.

 

ప్రభుత్వం రుణాల మాఫీ చేతున్నట్లు ప్రకటించిన తరువాత కూడా ఇంకా ధర్నాలు దేనికి చేస్తున్నట్లు అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగని ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు ధర్నాలు చేయకుండా వెనక్కి తగ్గితే పార్టీ పరువుపోతుంది. తీరాచేసి ధర్నాలు చేసేక జనాలు రాకపోయినా పార్టీ పరువు పోతుంది. అందుకే ఈ ధర్నాల కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అందరూ చెమటోడుస్తున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రుణాలు మాఫీ చేయడమే తప్పు, సాధ్యం కాదన్నట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రుణాలు మాఫి చేయమని ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతను సాధ్యం కాదని చెప్పిన దానిని ప్రభుత్వం సాధ్యమేనని చేసి చూపుతున్నప్పుడు ఇంకా ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతనికి ప్రతీ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయం చేయడం అలవాటుగా మారింది. అందుకే ఈ పంట రుణాల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయితే దాని వలన ఆయనకి ఏమి ప్రయోజనం ఉంటుందో కూడా చెపితే బాగుంటుంది, అని జగన్ కి చురకలు వేసారు.