ఏపీలో విద్యుత్ ఫుల్: చంద్రబాబుకే ఫుల్ క్రెడిట్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం అరికట్టిన తీరు గమనిస్తే ఆయన చాలా ముందు చూపుతో చాలా చురుకుగా చర్యలు చెప్పట్టినట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన స్పీడు మేము అందుకోలేకపోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పడం అతిశయోక్తికాదనిపిస్తోంది.

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే డిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని సంపాదించుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తరువాత కూడా అదే మెరుపు వేగంతో కేంద్రం నుండి అదనపు విద్యుత్, మహారాష్ట్రలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా వంటివి అన్నీ చక్కబెట్టేయడంతో రెండు మూడు నెలలలోనే రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడగలిగింది. ఆయన కార్యదీక్ష చూసి కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సైతం మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.

 

రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడింది కదాని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకోకుండా, 2015-16సం.లలో అవసరమయిన విద్యుత్ కోసం ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం గమనిస్తే కామినేని మాటలు నిజమని అంగీకరించక తప్పదు.

 

వచ్చే ఏడాదిలో ముఖ్యంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వివిధ విద్యుత్ సంస్థలతో 2,000మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్న ఏపీ ట్రాన్స్ కో సంస్థ, తమిళనాడు, ఓడిషా, కర్ణాటక రాష్ట్రాలలో గల 20 ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి అదనంగా ఇంకో 2,100 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం కూడా ఒప్పందాలు చేసుకొంది. కేవలం ధర్మల్ విద్యుత్ సంస్థల నుండే కాక హైడల్ మరియు సోలార్ (619 మెగావాట్స్) విద్యుత్ ఉత్ప్పత్తి కేంద్రాల నుండి కూడా విద్యుత్ పొందేవిధంగా ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.

 

ఓడిషాలో గ్రిడ్ కో సంస్థ నుండి 300 మెగావాట్స్, కర్ణాటకలోని శాతవాహన మరియు జే.యస్. డబ్ల్యు. నుండి 780 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్నారు. తమిళనాడులోని మీనాక్షి సింహపురి, థర్మల్ టెక్ మరియు జైస్వాల్ పవర్ కంపెనీలతో, ఇతర రాష్ట్రాలలో స్టెరిలైట్, జేపీయాల్, టాటా పవర్, స్టెరిలైట్ ఎనర్జీ, సల్సర్ స్టీల్, వందన విద్యుత్, మరియు జి.యం.ఆర్.ఈ.టి.యల్. విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒక యూనిట్ రూ. 3.50 నుండి రూ. 4.00 ధరతో విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు జరిగాయి.

 

అదేవిధంగా కేంద్రప్రభుత్వ సహకారంతో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఏర్పాటు చేయబడిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో కూడా విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సోలార్ విద్యుత్ ధర చాలా అధికంగానే ఉంది. ఒక్కో యూనిట్ ధర రూ. 8.22 నుండి రూ. 17.91 వరకు ఉంటుంది. కానీ ఏపీ ట్రాన్స్ కో సంస్థ మాత్రం రూ. 3.70 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన దానిని కేంద్రప్రభుత్వమే సదరు సంస్థకు నేరుగా చెల్లిస్తుంది. ఈ రాయితీ సోలార్ విద్యుత్ పధకంలో తొలుత అనంతపురం నుండి 40 మెగావాట్స్, చిత్తూరులో గల ఎక్మీ సోలార్ నుండి 40 మెగావాట్స్, అనంతపురం, చిత్తూరు మరియు కర్నూలులోగల ఎక్మీ క్లీన్న్ టెక్ నుండి 160 మెగావాట్స్, సింగపూర్ కి చెందిన సన్న్ ఎడిషన్ ఎనర్జీ హోల్డింగ్స్ నుండి 30 మెగావాట్స్, రెయిన్ సిమెంట్స్ నుండి 22 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయి.

 

ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో నిర్మాణంలో ఉన్న రెండవ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి త్వరలోనే రాష్ట్రానికి 800 మెగావాట్స్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందాలన్నిటి కారణంగా వచ్చే సం.లో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకపోవచ్చునని ఏపీ ట్రాన్స్ కో సంస్థ చైర్మన్ కే. విజయానంద్ తెలిపారు.

 

ఇవికాక తూర్పు గ్రిడ్ నుండి మరో 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంది. కానీ అక్కడి నుండి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్లు వేయవలసి ఉంది. అందుకోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది కనుక వచ్చే ఏడాదిలో అక్కడి నుండి విద్యుత్ సరఫరా రాలేకపోవచ్చును. కానీ భవిష్యత్తులో అక్కడి నుండి 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

 

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంటూనే మరోవైపు రాష్ట్రంలో థర్మల్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి బయట రాష్ట్రాల నుండి కొంత విద్యుత్ కొనుగోలు చేయవలసి వచ్చినా 2016-17నాటికి రాష్ట్రం విద్యుత్ ఉత్ప్పత్తిలో స్వయం సంవృద్ది సాధించి, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేయగల స్థితికి చేరుకోగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.