త్యాగమూర్తులకే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి

 

దేవుడి దగ్గరకు వెళ్ళినా కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకొనే త్యాగామూర్తులయిన నేతలు మనకున్నారు. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని, ప్రజలందరూ కలిసి మెలిసి సుఖంగా ఉండాలని కోరుకొన్నట్లు మన బొత్స బాబు శలవిచ్చారు.

 

“కొందరికి పదవులు ఏర్పరిచేందుకే రాష్ట్రం విడగొట్టబడుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా త్యాగం చేసిపడేస్తానని” ఒకే ఒక పంచ్ డైలాగుతో, సమైక్యంగా ముఖ్యమంత్రి పదవి రేసులో ముందుకు దూసుకుపోతున్న లగడపాటి, రాయపాటి, వెంకటేష్, శైలజానాథ్ వంటి వారి కంటే అన్నివిధాల తానే పెద్ద త్యాగ మూర్తినని, అందువల్ల కొత్తగా ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుర్చీకి తనే బాగా సూటవుతానని బొత్స చెప్పకనే చెప్పారు.

 

“ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత నాకీ రాజ్యసభ సీటేందుకు, విశాఖ లోక్ సభ సీటు మాత్రం ఎందుకు? దాని మీద ముచ్చటపడుతున్న పురందేశ్వరికే నా సీటు ఇచ్చేస్తాను. ముప్పై ఏళ్లుగా దేశానికి, రాష్ట్రానికి, విశాఖ నగరానికి ఎనలేని సేవలందిస్తున్న నేను, కొత్తగా ఏర్పడుతున్న ఆంద్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి గా నావంతు సేవలు నన్ను చేసుకోనీయండి” అని సుబ్బిరామిరెడ్డి అంటే, “అసలు ఇంతపెద్ద సమైక్య రాష్ట్రాన్నిఒంటి చేత్తో ఏలుతున్న నా సంగతి మరిచిపోయి మీలో మీరే పోటీలుపడుతూ నా కుర్చీలో కర్చీఫ్ వేసేస్తానని ఈ ముసుగులో గుద్దులాటలేమిటి? అసలు నేనొకడిని ఉన్నానని మరిచిపోయారా?” అంటూ అప్పుడు ఒరిజినల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చిరాకు పడటం ఖాయం.

 

ఇక రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేదే ప్రశ్న. కానీ ఆంధ్ర రాష్ట్ర నేతలకి మాత్రం రాజధాని ఎక్కడ పెట్టుకొంటే తమ రియల్ వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుందనే మరో పాయింటు కూడా ఉంది.

 

రాజధానిని విశాఖలో పెట్టుకొంటే ఉత్తర కోస్తా జిల్లాలలో తన వ్యాపార కార్యక్రమాలన్నీ మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోవచ్చునని ఆ జిల్లాలకు చెందిన కొందరు నేతలు ఆలోచిస్తుంటే, “కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడని, రాజమండ్రీని కాదని ఎక్కడో మారు మూల ప్రాంతంలో పెడితానంటే ఎలా?” అని అక్కడి రాజకీయ వ్యాపారవేత్తలు అభ్యంతరం చెప్పడం ఖాయం.

 

“అయినా అంగుళం భూమి కూడా ఖాళీ లేని ఆ ఊళ్లలో రాజధాని ఏర్పాటు చేయడం అసలు సాధ్యమేనా? మా ఒంగోలు నేతలు అమాయకులు, నిస్వార్ధపరులు గనుక ఇక్కడ ఇంకా ప్రభుత్వ భూములు కొన్ని మిగిలే ఉన్నాయి. గనుక ఇక్కడే బెస్ట్” అని అక్కడి నేతల వాదన. “ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మా కర్నూలుకి హ్యాండిచ్చి హైదరాబాదుకి రాజధాని పట్టుకొనిపోయారు. అప్పటి నుంచి వేసిన గొంగళి వేసిన చోటనే పడి ఉంది. గనుక కనీసం ఇప్పుడయినా మా రాజధాని మాకిచ్చేస్తే మా ప్రాంతం కొంచెం డెవెలప్ అవుతుందని” కర్నూల్ నేతల వాదన.

 

“తిరుపతిలో పెట్టుకొంటే మన రాష్ట్రానికి ఆ స్వామివారి కృప బాగా ఉంటుంది. గనుక కొత్త రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని” మరికొందరి వాదన.

 

అందుకే రోడ్డు మ్యాపు చేతిలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవలన్నారు పెద్దలు.