ఏపీ విభజన హేతుబద్ధంగా జరగలేదు... గవర్నర్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం నాడు ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు వున్నాయని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన రీతిలో సాయం అందలేదని, కేంద్రం నుంచి మరింత సాయం కోసం ఎదురుచూస్తున్నామని గవర్నర్ చెప్పారు. హేతుబద్ధంగా లేని విభజనకు తోడుగా ప్రకృతి కూడా ఏపీకి నష్టం కలిగించిందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించిందని చెప్పారు. ఏపీ పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరిగా అవసరమని గవర్నర్ అన్నారు. ఈ తొమ్మది నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమని గవర్నర్ చెప్పారు.