ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా?

 

 

బీజేపీపై ఆంధ్రుల్లో వ్యతిరేకత తగ్గిపోతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా? ప్రత్యేక హోదా ఇష్యూలో బీజేపీపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఇప్పుడు కరిగిపోతుందా? ఏపీ రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే నిజమేనంటున్నారు పరిశీలకులు. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ, అభిమానం పెరిగిందని, ఈ పరిణామమే ఏపీలోనూ బీజేపీకి అనుకూలంగా మారిందనే మాట వినిపిస్తోంది. మోడీని ఢీకొట్టగలిగే నాయకుడు ప్రస్తుతం దేశంలో ఎవరు లేరనే అభిప్రాయానికి ఆంధ్రులు వచ్చారని, దాంతో బీజేపీపై సానుకూల దృక్పథం కనిపిస్తోందని అంటున్నారు.

ఒకవైపు మోడీపై రోజురోజుకీ పెరుగుతోన్న అభిమానం... మరోవైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో... ఏపీలో బలపడటానికి ఇదే మంచి సమయమని కమలనాథులు భావిస్తున్నారు. పోలవరం, అమరావతి, రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్షలాంటి దుందుడుకు నిర్ణయాలతో వివాదాల్లో చిక్కుకుంటున్న జగన్ సర్కారును ఇప్పటికే ఇరకాటంలో పెడుతున్న కమలనాథులు... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మోడీతో మాత్రమే సాధ్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

ఎంతకాదన్నా, బీజేపీకి బలం...హిందుత్వవాదమే. అందుకే మతపరంగానూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏపీలో క్రైస్తవులంతా గంపగుత్తగా జగన్ కు ఓట్లేయడంతో, వైసీపీకి వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మతానికి సంబంధించిన భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తేలిక, అందుకే జగన్ ప్రభుత్వం... క్రైస్తవులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై మతపరమైన దాడి మొదలుపెట్టిన బీజేపీ.... ‘రావాలి యేసు-కావాలి యేసు‘ అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వ విధానం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలదళం అస్త్రశస్త్రాలను సిద్దంచేసుకుంటోంది.