రేపటి నుండే అసెంబ్లీ....బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ కూడా !

 

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు జులై 11న ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలకు ముందు స్పీకర్ అధ్యక్షతన ఈరోజు బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన నేడు జరగిన్న ఈ సమావేశానికి హాజరు కాకూడదని విపక్ష నేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, కిష్టప్పను పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అధికార పక్షం తరఫున సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరు మంత్రులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. 

కొద్దిసేపటి క్రితం  బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఏపీ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలను 14 పని దినాల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లి సమావేశాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో ఏపీ అసెంబ్లికి సెలవు దినాలుగా నిర్ణయించారు. ఇక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ నెల 12న శుక్రవారం సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

అదే రోజు మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభలో కరవు, విత్తనాలు, వైసీపీదాడులపై చర్చించాలని టీడీపీ కోరింది. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున అచ్చెన్నాయుడు, నిమ్మల కిష్టప్ప, జనసేన పార్టీ తరపుర వరప్రసాద్ లు పాల్గొన్నారు.