రెండోరోజూ గందరగోళం

 

కాల్‌మనీ వ్యవహారం మీద రెండోరోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. కాల్‌మనీ వ్యవహారం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ఎంతసేపైనా చర్చించవచ్చని స్పీకర్ సూచించారు. చర్చ తర్వాత సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని స్పీకర్ పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు పట్టు వదల్లేదు. అయితే వైసీపీ నాయకులు సభను అడ్డుకోవడం న్యాయం కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రమం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు సభా నిబంధనలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.