నేటి నుండి ఆంద్ర, తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు

 

నేటి నుండి ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్ లో ఒకే ప్రాంగణంలో జరుగబోతున్నాయి. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఇంచుమించు ఒకే సమయానికి అంటే మార్చి 27వ తేదీన ముగిసే అవకాశం ఉంది.

 

మొదట ఉదయం 8.55 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఆ తరువాత 11 గంటలకు ఆయన ప్రసంగంతో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు కూడా మొదలవుతాయి. రెండు ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాయి.

 

తెలంగాణా ఈటెల రాజేందర్ ఈనెల 11వతేదీన, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఈనెల12వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆంద్రప్రదేశ్ బడ్జెట్ రూ. 1.10 లక్షల కోట్లు, తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంచుమించు లక్ష కోట్లు వరకు ఉండవచ్చునని సమాచారం.

 

ఇరు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకే సమయంలో ఒకే ప్రాంగణంలో జరుగబోతున్నందున, ఇరు రాష్ట్రాల శాసనసభ్యుల మధ్య ఘర్షణలు జరుగకుండా ఉండేందుకు ఇరు రాష్ట్రాల స్పీకర్లు ముందుగానే సమావేశమయ్యి, ఎవరు ఏ ప్రవేశ ద్వారాలుపయోగించుకోవాలో, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో వంటి అంశాలనన్నిటినీ ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అందుకు తగిన ఏర్పాట్లు చేసారు. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు, పోలీసులు ఉంచాలని వారు నిర్ణయం తీసుకొన్నారు. ఎటువంటి సమస్య ఏర్పడినా వెంటనే ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు సమావేశమయ్యి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకొన్నారు. మొట్టమొదటిసారిగా రెండు రాష్ట్రాల శాసనసభ సమావేశాలు ఒకే సమయంలో ఒకే ప్రాంగణంలో జరుగుతున్నందున, పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మొహరించి కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు.