యాంటిబయాటిక్స్‌తో గుండెపోటు!

ఒకప్పుడు ఏదన్నా దగ్గో, జ్వరమో వస్తే చిన్నపాటి మందులతో వాటికి చికిత్స చేసే ప్రయత్నం చేసేవారు. మరీ ప్రాణాల మీదకి వస్తోంది అన్న సందర్భంలోనే యాంటిబయాటిక్‌ మందులను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు... రోగంతో రెండ్రోజులు కూడా పడుకునే ఓపిక జనానికి లేదు. చిన్నాచితకా అనారోగ్యాలకి యాంటిబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు!


బాక్టీరియా అంటే కేవలం చెడు చేసేది మాత్రమే కాదు. పాలని పెరుగుగా మార్చే సూక్ష్మజీవులు కూడా బాక్టీరియా కిందకే వస్తాయి. అలాంటి మంచి బాక్టీరియా మన శరీరంలోనూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఈ ఇలాంటి మంచి బాక్టీరియానే! దీనినే gut bacteria అంటారు. యాంటీబయాటిక్‌ మందుల వల్ల ఈ మంచి బాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. ఇంతకీ దీనికి గుండెపోటుకీ సంబంధం ఏమిటంటారా!


జర్మనీకి చెందిన పరిశోధకులు- గుండెజబ్బులు ఉన్నవారిలో ఇతరత్రా లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో కనుగొనే ప్రయత్నం చేశారు. గుండె సమస్యలు ఉన్నవారి పేగులలో gut bacteria ఏమంత బాగోలేదని తేలింది. పైగా ఉన్న కాస్త బాక్టీరియా కూడా పేగులలోంచి బయటకు వెళ్లిపోతోందని బయటపడింది. ఇలా జీర్ణవ్యవస్థలోని బాక్టీరియా తగ్గేకొద్దీ గుండెజబ్బు తీవ్రత కూడా పెరుగుతున్నట్లు గమనించారు.


మన పేగులలో ఉండే Blautia, Faecali తరహా బాక్టీరియా కేవలం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే కాకుండా... శరీరంలో వాపుని తగ్గించే ప్రయత్నం చేస్తాయట! దాంతో గుండె ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ యాంటీబయాటిక్స్ వాడటం, పొగ తాగడం, తరచూ క్లోరిన్‌ నీళ్లు తాగడం లాంటి అలవాట్లతో పేగులలోని gut bacteria దెబ్బతిని తీవ్ర అనారోగ్యాలకి దారితీస్తుంది.


అదీ విషయం! కాబట్టి ఇక మీదట ఆహారాన్ని జీర్ణం చేసుకునే విషయంలో తరచూ సమస్యలు వస్తుంటే... అదేదో చిన్నపాటి ఇబ్బందిగా కొట్టిపారేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మన జీర్ణశక్తికీ ఆరోగ్యానికి ఖచ్చితమైన సంబంధం ఉంటుందన్న విషయాన్ని గ్రహించమంటున్నారు. పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అనవరసంగా యాంటీబయాటిక్స్‌ను వాడకపోవడం ద్వారా పొట్టని పదిలంగా కాపాడుకోమంటున్నారు.

 

- నిర్జర.