యాంటిబయాటిక్స్‌తో చంపేస్తున్నారు...

 

యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవే లేని రోజుల్లో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారేది. కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం మాట అటుంచితే… అవసరమైనప్పుడు అసలు ఏ మందూ పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే antibiotic resistance అని పిలుస్తున్నారు.

 

యాంటిబయాటిక్స్‌ గురించి ఇప్పుడు ఈ కథంతా మళ్లీ చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వైద్యులు ఈ యాంటిబయాటిక్స్‌ని రోగులకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు లండన్‌ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 1,85,014 మందిని పరిశీలించారు. వీరంతా కూడా 65 ఏళ్లు పైబడినవారే. అంటే వైద్యులు వీరికి చికిత్సని అందించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టవశాత్తూ వీరంతా వైద్యుల దగ్గరకి చిన్నచిన్న అనారోగ్యాలతో వెళ్లినప్పుడు కూడా, వీరికి అనవరసంగా యాంటిబయాటిక్స్‌ను అందించారట. ఇలా సగానికి సగం కేసులలో యాంటిబయాటిక్స్‌ తీసుకోవాలంటూ వైద్యులు తొందరపడినట్లు తేలింది. ఈ యాంటిబయాటిక్స్‌ కూడా మామూలువి కాదు… అలెర్జీలు, విరేచనాలు, గుండెజబ్బులు, కండరాల సమస్యలు వంటి నానారకాల దుష్ప్రభావాలు చూపించేవి. ఇలా ఉత్తిపుణ్యానికే శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ తీసుకోమంటూ వైద్యులు సలహా ఇస్తున్నట్లు తేలింది.

 

కాస్త విశ్రాంతి, మరికాస్త ఉపశమనంతో తగ్గిపోయే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యలకు కూడా యాంటిబయాటిక్స్‌ను సూచించడం చూసి పరిశోధకుల తల తిరిగిపోయింది. ఇంతాచేసి ఈ వైద్యులంతా మహామహా సీనియర్లు! యాంటిబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడకూడదన్న అవగాహన ఉన్నవారు. చిన్నపాటి సమస్యలకు ఆ మందులు అస్సలు అవసరమే లేదని తెలిసినవారు. ఆరోగ్యం మీద అవగాహన ఉండే లండన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో కదా! అందుకనే యాంటిబయాటిక్స్‌ వాడకాన్ని అదుపు చేసేలా… అటు ప్రభుత్వమూ, ఇటు వైద్య సంస్థలూ కఠినమైన నిబంధనలను విధించాలని కోరుకుంటున్నారు పరిశోధకులు.

 

-నిర్జర.