కొత్త యాంటీబయాటిక్స్ రాకపోతే కోటిమంది చనిపోతారు

 


అవగాహన లేకపోవడం వల్లనో, రోగం త్వరగా తగ్గిపోవాలన్న ఆశతోనో... కారణం ఏదైతేనేం! విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడకం అన్ని చోట్లా కనిపించేదే. వీటి ప్రభావం నుంచి తప్పించుకున్న క్రిములు మరింత బలంగా రాటుదేలడం ప్రస్తుత సమస్య. ఆ సమస్యని పరిష్కరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాద సూచికలు జారీచేసింది.

 

ఇంతకుముందు చక్కగా పనిచేసిన యాంటీబయాటిక్స్, ప్రస్తుతం పనిచేయకపోవడం అనేది ప్రపంచం ముందున్న తాజా సవాలని హెచ్చరిస్తోంది WHO. ఇలా యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం ఏడు లక్షల మంది చనిపోతున్నారని ఆ సంస్థ అంచనా వేస్తోంది. పరిస్థితులను ఇలాగే చూస్తూ ఊరుకుంటే 2050 నాటికి ఏకంగా ఏటా కోటిమంది అర్థంతరంగా చనిపోయే ప్రమాదం ఉందని చెబుతోంది.

 

WHO యాంటీబయాటిక్స్‌కు లొంగని మందులు అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పేర్కొన్న సూక్ష్మక్రిములను ఎదుర్కొనేందుకు కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనే ప్రయత్నం చేయకపోతే, భవిష్యత్తులో మన ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిపోతుందని తేల్చి చెప్పేసింది. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలలో ఉన్న సూక్ష్మక్రిములకైతే ప్రస్తుతం ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదట. Carbapenems అనే అతి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కు కూడా ఇవి లొంగడం లేదట.

 

ఇక జాబితాలో పేర్కొన్న మిగతా సూక్ష్మక్రిముల పరిస్థితి కూడా ఏమంత అనుకూలంగా లేదు. ఇంతకు ముందు అవి ఏఏ యాంటీబయాటిక్స్‌కైతే పనిచేశాయో ప్రస్తుతం ఆ మందులకు సదరు క్రిములు రాటుదేలిపోయాయట. వీటి మీద ప్రభావం చూపగల అతి కొద్ది మందులు కూడా మున్ముందు నిష్పలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. వీటిలో చాలా తరచుగా కనిపించే గనేరియా, సాల్మొనిలే వంటి సూక్ష్మక్రిములు కూడా ఉండటం బాధాకరం.

 

WHO తన జాబితాలో పేర్కొన్న 12 సూక్ష్మక్రిములే కాదు... క్షయ వ్యాధిని కలిగించే Mycobacterium tuberculosis వంటి క్రిములు కూడా రోజురోజుకీ మందులకి రాటుదేలిపోతున్నాయి. అయితే ప్రభుత్వాలు కానీ, పరిశోధనా సంస్థలు కానీ ఈ సమస్య మీద తగినంత దృష్టి పెట్టడం లేదన్నది WHO ఆవేదన. కనీసం ఇప్పటి నుంచీ సరికొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనే ప్రయత్నం చేసినా... ఆ పరిశోధనలు సాకారం కావడానికి మరో పదేళ్లన్నా పడుతుంది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుందని నిపుణులు భయపడుతున్నారు. మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించాలనుకునే మందుల కంపెనీలు, వైద్య పరిశోధనలు చేయడం తమ బాధ్యత కాదని భావించే ప్రభుత్వాలు ఎప్పటికి మేలుకుంటాయో! ఆపాటికి ఎంత నష్టం వాటిల్లుతుందో!

 

- నిర్జర.