TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారీ ఉగ్ర కుట్ర భగ్నం..విస్పోటక పదార్థాలు స్వాధీనం

Published on: Thu Jul 3, 2025 9:12PM

 

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.   అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించారు న్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు తో కలసి డి.ఐ.జి కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. గత నెల 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారన్నారు. 

ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారన్నారు.  విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్  ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారని ఆయన తెలిపారు. 

ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయన్నారు., వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు (ఐఇడియస్ ) తయారు చేయవచ్చు అన్నారు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడిందన్నారు. అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ  మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుందన్నారు.వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారన్నారు.


నిందితుల భార్యలు మహిళ పోలీసుల పై దాడికి యత్నం.

   ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు అయిన సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య) మరియు షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే  కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారన్నారు.   సైరా భాను మరియు షమీం లను శోధనకు అడ్డుపడినందుకు మరియు మహిళా పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపామన్నారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని డి.ఐ.జి పేర్కొన్నారు. పోలీసుల నిరంతర శ్రమతో ఇంటిని శోధించి పై విస్ఫోటక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని డి.ఐ.జి వివరించారు. 

ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు  చేసినట్లు డి.ఐ.జి తెలిపారు. ఈ కేసులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఎగ్మోర్ ఘటన రోజు అనేక ఇతర బాంబులు కూడా వివిధ ప్రాంతాలలో (చెన్నై, త్రిచ్చి, కోయంబత్తూరు) పగులగొట్టబడ్డాయి. 1999లో కోచిన్-కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో ఈ నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించబోతుండగా, ఆ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అవి కాసర్‌గోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారన్నారు.. ఈ ఇద్దరు నిందితులు గత 20 సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు గుర్తింపులతో నివసిస్తూ, స్థానికంగా వివాహాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారన్నారు. ఇంకా ఇతర సహచర నిందితుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు.  మరిన్ని వివరాలు తర్వాత అడ్వైజరీలో తెలియజేయబడతాయని డి.ఐ.జి తెలిపారు.