విఫలమయిన రెండు మాహా ఉద్యమాలు

 

సామాజిక కార్యకర్తలు అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ కలిసి అవినీతికి వ్యతిరేఖంగా లోక్ పాల్ బిల్లు కొరకు డిల్లీలో ఉద్యమం ప్రారంభించినప్పుడు యావత్ దేశం కూడా సానుకూలంగా స్పందించింది. వారిరువురూ దేశ వ్యవస్థలో పెనుమార్పులు తేగల సమర్ధులని ప్రజలు చాలా ఆశపడ్డారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ వారిద్దరూ తలోదారి పట్టారు.

 

వ్యవస్థలో ఇమిడిపోయున్న అవినీతిని కేవలం ప్రజా ఉద్యామాల ద్వారానే రూపుమాపగలమని అన్నా హజారే భావిస్తే, అధికారం లేనిదే వ్యవస్థను ప్రక్షాళనం చేయడం అసంభవమని భావించిన అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని స్థాపించారు.

 

నాటి నుండి వారిరువురూ కూడా ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించుకోవడమే కాకుండా అప్పుడపుడు తీవ్ర విమర్శలు కూడా చేసుకొంటున్నారు. తద్వారా వారు నిర్దేశించుకొన్న గమ్యానికి ఇద్దరూ చాలా దూరం అయిపోయారు.

 

అన్నా హజారే ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభకు కనీసం వెయ్యి మంది జనం కూడా రాలేదంటే ప్రజలకి ఆయన పట్ల విశ్వాసం సడలినట్లు అర్ధం అవుతోంది. అయినప్పటికీ ఆయన ‘125 కోట్ల జనాభా గల భారతదేశం నుండి కేవలం 6కోట్ల మంది నాకు తోడుగా నిలిస్తే చాలు, నేను దేశం నుండి అవినీతిని పారద్రోలుతాను’ అని చెప్పడం విశేషం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్నపటికీ, ఆయన సరయిన కార్యాచరణ ప్రణాలిక లేకుండా ముందుకు సాగుతూ ప్రజలను ఆకట్టుకోవాలని విఫలయత్నం చేస్తున్నారు.

 

ఇక, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయపార్టీని పెట్టి సరయిన నిర్ణయమే తీసుకోన్నపటికీ తదనంతరము ఆయన కూడా పార్టీని నిర్మించుకొనే ప్రయత్నం చేయకుండా, అంభానీలు, గోయెంకాల స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు అంటూ సంచలనాలు సృష్టించి మీడియాను, తద్వారా ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. కానీ, దానివల్ల ఆయనకు కానీ, ప్రజలకు గానీ ఒరిగేదేమీ లేకపోగా, ఆయన పార్టీకే ఆయనే అడ్డంకులు సృష్టించుకొన్నట్లు అయింది.

 

రాజకీయ పార్టీ పెట్టుకొని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పాల్గొని పార్టీని గెలిపించుకోవాలంటే ఆయన ముందుగా పార్టీని బలపరుచుకొని ఉండాలి. కానీ, ఆయన ఆపని చేయకుండా నేడు డిల్లీలో పెరిగిన కరెంటు,నీటి చార్జీలకు వ్యతిరేఖంగా నిరవదిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. దీనివల్ల ఆయన సాదించేదేమి లేదని ఆయనకు బాగానే తెలిసి ఉంటుంది. అయినా కూడా ఇటువంటి అనవసరమయిన పనులకు పూనుకొని ఒక దశా దిశా లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలలో పాల్గొనే ఆలోచనే గనుక ఉండి ఉంటే ఆయన ఇప్పటికే తన పార్టీని దేశమంతటా వ్యాపింపజేసుకొని ఉండేవారు. కానీ ఆయన పోరాటాలు గమనిస్తే ఆయన ‘ఆమ్ ఆద్మీ’ కేవలం డిల్లీకే పరిమితమయినట్లుంది.

 

ఉప్పెనలా మొదలయినా వారిరువురి మహాఉద్యమం ఊహించినదానికంటే ముందే చల్లారిపోవడంతో దేశంలో అవినీతిపరులందరూ ఇప్పుడు మళ్ళీ నిశ్చింతగా తమ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ఒక ఉద్యమాన్ని నిర్మించడం ఎంత కష్టమో దానిని కడదాక సమర్ధంగా నడిపించడం ఇంకా కష్టమని వారిరువురూ మరోమారు నిరూపించారు.