ఇలా చేస్తే కోపం మాయం


సంతోషం, బాధ ఎలాగో కోపం కూడా సహజమైన లక్షణమే! కోపంతోనే మన అసంతృప్తిని, అసహనాన్నీ వ్యక్తం చేయగలం. కానీ మనిషి కోపాన్ని కాకుండా కోపమే మనిషిని అదుపుచేస్తే బంధాలు ఛిద్రమైపోతాయి. అదే కోపాన్ని మనసులో దాచిపెట్టుకుంటే మన అంతరంగాన్ని దహించివేస్తుంది. అందుకనే కోపాన్ని జయించే మార్గాలు ఇవిగో...

 

విశ్లేషణ తప్పదు - మనలో హద్దుల మీరి కోపం ఏర్పడినప్పుడు, దానికి కారణం ఏమిటా అని విశ్లేషించుకోక తప్పదు. నిజంగా అవతలివారి తప్పుందా? ఉంటే ఆ తప్ప పట్ల మీ అసమ్మతిని తెలియచేస్తే ఉపయోగం ఉంటుందా! మీ కోపాన్ని వ్యక్తపరిచి తీరాలి అనుకున్నప్పుడు... కర్ర విరగకుండా, పాము చావకుండా మీ మాటలను ఎలా ప్రయోగించాలో నిర్ణయించుకోవాలి. ఒక్క క్షణం కోపాన్ని పక్కన పెట్టి విచక్షణకు పనిపెడితే ఇంత విశ్లేషణా కూడా నిమిషంలో తేలిపోతుంది.

 

కోపాన్ని గ్రహించండి – కోపమనేది ఒక భావన మాత్రమే కాదు... దాని వెనుక చాలా శారీరిక స్పందనలు కనిపిస్తాయి. కోపం వల్ల పెరిగిపోయే అడ్రినల్ ప్రభావంతో హృదయవేగం పెరగడం, కండరాలు బిగుసుకోవడం వంటి స్పందనలు కనిపిస్తాయి. ఈ మార్పులను కనుక గ్రహించగలిగితే మరింత విచక్షణతో మెలుగుతాం. లేకపోతే మనకి తెలియకుండా ఒక్కసారిగా విరుచుకుపడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.

 

శారీరిక శ్రమలో ఇమిడిపొండి – కోపం వచ్చిన తరువాత దానిని అదుపు చేసుకునేందుకు ఓ అత్యుత్తమ మార్గం ఉంది. శరీరం ఏదన్నా వ్యాయామంలో నిమగ్నమయ్యేలా చేస్తే మనసుని కాసేపు దారిమళ్లించినట్లు అవుతుంది. వ్యాయామం వల్ల ఎండోమార్ఫిన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఈ ఎండోమార్ఫిన్స్ వల్ల కోపం తగ్గి మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.

 

వాతావరణాన్ని మార్చండి – కోపం కలిగిస్తున్న సందర్భం నుంచి తప్పుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఏదన్నా పుస్తకం చదవడమో, అలా వ్యాహ్యాళికి వెళ్లడమో, సంగీతం వినడమో... చేయడం వల్ల మనసుని కాస్త బుజ్జగించినట్లు అవుతుంది.

 

అంకెలు పనిచేస్తాయి – కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టమని చెబుతూ ఉంటారు. ఇది ఉపయోగపడే చిట్కానే! ఒకటి నుంచి పది వరకు అంకెలను లెక్కపెట్టడం వల్ల మనసులోని కోపం ఉపశమిస్తుంది. ఈ అంకెలు లెక్కపెట్టడంతో పాటుగా, ఒకో అంకెతో పాటుగా శ్వాసని కూడా నిదానంగా పీల్చుకుంటే మనసులో కోపం స్థానంలో ప్రశాంతత ఆవహిస్తుంది.

 

ఊహకి పదును పెట్టండి – మనసంతా కోపంతో నిండిపోయినప్పుడు... నవ్వు తెప్పించుకునే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నా, ప్రశాంతమైన ప్రకృతిని తల్చుకున్నా మేలే జరుగుతుంది. ఆఖరికి మీకు కోపాన్ని కలిగిస్తున్న వ్యక్తిని చిత్రమైన వేషంలో ఊహించుకున్నా మనసులోని కోపం పటాపంచలైపోతుంది.

 

పంచుకోండి – మీ కోపాన్ని ఎవరన్నా సన్నిహితులతో పంచుకోవడం కూడా మంచిదే! దాని వల్ల వారు ఏదన్నా పరిష్కారాన్ని చూపించవచ్చు. మీకు కూడా మనసులోని భారం తగ్గవచ్చు.

- నిర్జర.