TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సులు బంద్

Published on: Tue Mar 31, 2015 4:09PM

 

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల మీద మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్నుల భారం మీద ఆంధ్రప్రదేశ్‌లో నిరసన వ్యక్తమవుతోంది. అంతర్రాష్ట్ర పన్నుల భారం మీద ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు మంగళవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో మంగళవారం రాత్రి నుంచి 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌ని ఇప్పటికే నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ వాహనాల మీద పన్ను విధించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. దీనివల్ల రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడతారని, ధరలు పెరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు చేయడాన్ని విరమించుకోని పక్షంలో తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు పన్ను వేసే విషయాన్ని సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. ఇదిలా వుండగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దారుణమని, ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌కి ఏపీ వాహనాలు వస్తే పన్ను వేయాలని నిర్ణయించడం దారుణమని సీపీఐ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ విషయం మీద కోర్టును ఆశ్రయిస్తామని ప్రైవేట్ వాహనాల యజమానులు చెప్పారు.