గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మృతి
Published on: Tue Jun 23, 2015 9:46AM

సముద్రంలో చేపల వేటకు వెళ్ళి గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరణించిన మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పగడాల పేటకు చెందినవారిగా గుర్తించారు. పగడాలపేటకు చెందిన ఒక మత్స్యకారుడు మంగళవారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడుగురి మృతితో గల్లంతైన వారిలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈనెల 16వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన వాటిలో 20 పడవలు కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాలకు చేరుకున్నాయి. 20 పడవల్లోని దాదాపు 100 మంది మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. ఇంకా 23 పడవల్లోని వందమందికి పైగా మత్స్యకారులు ఇంకా సముద్రంలోనే చిక్కుకుని వున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం 3 హెలికాప్టర్లతో గాలింపు జరుగుతోంది.


