అవిశ్రాంత శ్రామికుడు సీఎం చంద్రబాబు

 

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎలా వుండాలి, నాయకుడు అంటే ఎలా వుండాలి అనే ప్రశ్నలకు ఇలా వుండాలి అని సమాధానంగా ప్రపంచమంతా చూపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వుంది. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భుజ స్కందాల మీదకు తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్ళబోతోందన్న నమ్మకం బలపడుతోంది. ఈ సమయంలో అనుకోకుండా వచ్చిన హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేయడంతోపాటు చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి పెద్ద పరీక్షలా నిలిచింది.

 

హుదుద్ తుఫాను వస్తోందని తెలిసినప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనలోని కార్యసాధకుడు ఈ అంశం మీద దృష్టిని కేంద్రీకరించేలా చేశారు. అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో తుఫాను రాకని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తుఫాను తీరం దాటే అవకాశం వున్న ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ముందస్తుగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ చర్యల ఫలితంగా అత్యంత భారీ స్థాయిలో హుదుద్ తుఫాను విశాఖ తీరాన్ని తాకినప్పటికీ జననష్టం చాలా తక్కువగా వుండేలా చేశారు.

 

ఎటో వెళ్ళబోతోందని అనుకున్న తుఫాను మరెటో మళ్ళి విశాఖ తీరాన్ని తాకింది. విశాఖ కనీవిని ఎరుగని రీతిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు తను ఆదుకునేది ఎవరా అని విశాఖ నగరం యావత్తూ ఎదురుచూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులు, అధికారులతో విశాఖలోనే మకాం వేసి అక్కడి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు వెళ్ళేలా చర్యలు తీసుకున్నాను. భారీగా దెబ్బతిన్న విశాఖపట్టణం రెండు రోజుల్లోనే ఒక మోస్తరుగా కోలుకునేలా చేశారు. ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలతోనే వుంటూ ఆయన చేస్తున్న కృషిని చూస్తున్న వారికి నాయకుడంటే ఇలా వుండాలన్న అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమను చూసి, ఆయన ద్వారా లభించిన స్ఫూర్తితో ఎంతోమంది విరాళాల రూపంలో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు తుఫాను విషయంలో వ్యవహరించిన తీరు ఉత్తరాంధ్ర ప్రజల్లో మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన నాయకత్వం మీద వున్న నమ్మకాన్ని ఎన్నోరెట్లు పెంచింది.