ఏపీ రాజధాని... దేనికెంత భూమి?

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని పలు భవనాల ఏర్పాటుకు ఎంతెంత భూమి అవసరమన్న విషయంలో శివరామకృష్ణ కమిటీ కొన్ని సూచనలు చేసింది. రాజధానిలో ప్రధానమైన భవనాలైన అసెంబ్లీ, సచివాలయం తదితర నిర్మాణాలకు మొత్తం 500 ఎకరాల భూమి సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. అయితే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఒకే ప్రాంతంలో కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం వుంటుందని పేర్కొంది. హైకోర్టు విషయానికి వస్తే, అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టు వుండాల్సిన అవసరం లేదని కమిటీ చెబుతోంది. సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయ ఏర్పాటుకు 20 ఎకరాలు, అసెంబ్లీ ఏర్పాటుకు 80 నుంచి 100 ఎకరాలు, గవర్నర్ నివాసగృహం రాజ్‌భవన్‌ కోసం 15 ఎకరాలు, హైకోర్టు, దాని సంబంధిత వ్యవస్థ నిర్మాణానికి దాదాపు 100 నుంచి 140 ఎకరాలు అవసరమని కమిటీ తెలిపింది.