ఏపీకి రూ. 2.27 లక్షల కోట్లు ప్యాకేజి?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని దాదాపు స్పష్టమయింది. దానికి బదులుగా రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజిని ఇచ్చేందుకు అవసరమయిన రోడ్ మ్యాప్ సిద్దం చేయమని ప్రధాని నరేంద్ర మోడి రెండు నెలల క్రితం నీతి ఆయోగ్ అధికారులను ఆదేశించారు. తక్షణమే రంగంలోకి దిగిన వారు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ రాష్ట్రంలో నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతెంత మొత్తాలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

 

రాష్ట్రంలో చేప్పట్టాల్సిన వేర్వేరు అభివృద్ధి పనుల కోసం రూ.2,25,484 కోట్లు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ తయారుచేస్తున్న నీతి ఆయోగ్ అధికారులకు ఒక నివేదిక పంపించింది. మళ్ళీ దానికి అదనంగా మరో రూ.1,892 కోట్లు వేరే పధకాల కోసం మంజూరు చేయాలని కోరుతూ మరో నివేదిక సమర్పించింది. అంతా కలిపి మొత్తం రూ.2,27,766 కోట్లయింది. ఈ మొత్తాన్ని మిగిలిన మూడున్నరేళ్ళ కాలంలో సర్దుబాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీతి ఆయోగ్ అధికారులు తమ ప్రతిపాదనలను సిద్దం చేసి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడికి పంపిస్తారు. వచ్చే నెల 5వ తేదీన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. కనుక ఆ తరువాత ఎప్పుడయినా ప్రధాని మోడీ దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.