రైల్వే జోన్ హామీ కూడా కేంద్రం గట్టున పెట్టబోతోందా?

 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ అంగీకరించినప్పటికీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయలేకపోయింది. ఇంతకాలం దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మభ్య పెట్టాయని రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం చెపుతున్న కారణాలు సహేతుకంగా ఉండటం, ప్రత్యేక హోదాకి తీసిపోని విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలు మంజూరు చేస్తానని కేంద్రప్రభుత్వం గట్టిగా హామీ ఇస్తుండటంతో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు సర్దుకుపోక తప్పడం లేదు.

 

ఆ తరువాత విజయవాడలో తగినంత జనాభా లేనందున అక్కడ మెట్రో రైల్ నడపడం లాభసాటి కాదు కనుక దానికి నిధులు అందించలేమని కేంద్రప్రభుత్వం నెల రోజుల క్రితమే తెలియజేసింది. ఈ విషయంలో కూడా కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును జపాన్ కు చెందిన జైకా అనే సంస్థ అందించే నిధులతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించుకొన్నారు.

 

ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల తరువాత ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ వంతు వచ్చినట్లుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డ్ చైర్మన్ ఎ.కె.మిట్టల్ నిన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకి తెలియజేసారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఓడిశాలోని భువనేశ్వర్ జోన్ ఆదాయం కోల్పోయి నష్టపోతుందని, కనుక ఓడిశా ప్రభుత్వం విశాఖలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కృష్ణారావుకి తెలిపారు. అయినా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు సాంకేతికంగా వీలుపడదని, అది ఆర్ధికంగా లాభసాటి కాదని రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు.

 

రైల్వే బోర్డ్ చైర్మన్ ఎకె.మిట్టల్ చెప్పిన ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృవీకరిస్తూ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ 14నెలలు గడిచిపోయినా ఇంతవరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడం, దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం, ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో ప్రాజెక్టు హామీలపై కేంద్రప్రభుత్వం ‘యూ టర్న్’ తీసుకోవడంవంటివన్నీ గమనించినట్లయితే కేంద్రప్రభుత్వం మనసులో మాటనే రైల్వే బోర్డ్ చైర్మన్ ఎకె.మిట్టల్ నోటితో చెప్పిస్తున్నట్లుందనే అనుమానం కలుగుతోంది.

 

ఓడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాని, రైల్వే జోన్ని అడ్డుకోగలిగింది. పోలవరం ప్రాజెక్టుపై కూడా అది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కనుక మున్ముందు దానిని కూడా అడ్డుకోవచ్చును. అపుడు కేంద్రం దానిని కూడా పక్కన పెట్టేయవచ్చును. కేంద్రంతో కానీ, బీజేపీతో గానీ ఎటువంటి మిత్రత్వం లేని ఓడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంటే, కేంద్రంలో భాగస్వామిగా, బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెదేపా ఏమి చేస్తోంది? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు గట్టిగా ఎందుకు పోరాడలేకపోతోంది?

 

ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో తెలుసని, అందుకే ఆర్ధిక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని తెదేపా ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్కో హామీని కేంద్రప్రభుత్వం ఏదో ఒక సాకుతో పక్కన పెట్టేస్తుంటే దానిని గట్టిగా నిలదీసి ప్రశ్నించవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తనకు తెలిసిన ఆ విషయాలను దాచిపెడుతోంది? ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఒక బలమయిన ఆయుధంగా మారాయి. ఇప్పుడు వాటికి రైల్వే జోన్ అనే మరో బలమయిన అస్త్రం అందించితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ రైల్వే జోన్ హామీని కేంద్రప్రభుత్వం నిజంగానే పక్కనబెడితే, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడిగి దానిని సాధించలేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మక తప్పదు. అప్పుడు నష్టపోయేది తెదేపా, బీజేపీలేనని గుర్తుంచుకోవాలి.