అమరావతి నిర్మాణంతో ప్రతిపక్షాలకు కష్టకాలం?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యాధునిక రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలు, దాని విశేషాలు వింటుంటే అది ఎప్పుడు తమ కళ్ళముందు సాక్షాత్కారిస్తుందా...అని ఆంద్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అత్యాధునిక విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున బహుశః మరొక రెండు మూడేళ్ళలోనే ప్రధాన రాజధాని నగరానికి కొంత రూపురేఖలు వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే అన్ని విధాల అభివృద్ధి చేసుకొన్న హైదరాబాద్ నగరాన్ని కోల్పోయామనే రాష్ట్ర ప్రజల బాధ కూడా మరిపిస్తుంది.

 

అమరావతిని అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ అవరోధాలను ఒకటొకటిగా అధిగమించుకొంటూ, విమర్శలు, ప్రసంశలు అందుకొంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేవరకు కూడా ప్రభుత్వానికి ఆర్ధిక, రాజకీయ సమస్యలు, అగ్ని పరీక్షలు ఎదుర్కోక తప్పక పోవచ్చును. కానీ ఒకసారి అది పూర్తయితే మాత్రం ఇక రాజధాని తరువాత దశల నిర్మాణం, అభివృద్ధి చాలా వేగవంతం అవడం తధ్యం.

 

ఏ రాష్ట్రానికయినా రాజధానే గుండె కాయ వంటిది. అందుకు మంచి ఉదాహరణ హైదరాబాద్ నగరమే. అన్ని విధాల అభివృద్ధి చెందిన ఆ నగరమే తెలంగాణా రాష్ట్రానికి అక్షయ పాత్రగా మారింది. అందుకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిని తెరాస అంగీకరించకపోవచ్చును. కానీ తెరాస అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్ కి ఐ.టి. పరిశ్రమలను రప్పించి దానిని అక్షయపాత్రగా మలిచింది మాత్రం ఆయనేనని అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఆయన మళ్ళీ రాజధాని అమరావతిని నిర్మించి చూపడం ద్వారా మరొకమారు రుజువు చేసి చూపించబోతున్నారు. కనుక ఇప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్న తెరాస, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల పార్టీల నేతలందరూ, హైదరాబాద్ కంటే అత్యాధునికంగా, ఆర్ధికంగా పటిష్టంగా ఉండేవిధంగా అమరావతిని నిర్మించి చూపించిన తరువాతయినా ఆయన గొప్పదనాన్ని, కార్యదీక్షతను అంగీకరించక తప్పదు.

 

మిగిలిన ఈ నాలుగేళ్లలో అమరావతికి రూపురేఖలు తీసుకురాగలిగితే, మిగిలిన నిర్మాణ కార్యక్రమం కూడా సజావుగా సాగేందుకు ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కట్టవచ్చును. ప్రతిపక్షాలకు లోలోపల బహుశః ఆ భయం ఉన్నందునే రాజధాని నిర్మాణానికి ఎన్ని అవరోధాలు సృష్టించగలవో అన్నీ సృష్టిస్తూ దాని నిర్మాణం ఆపలేకపోయినా కనీసం ఆలశ్యం జరిగితే చాలానే విధంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. కానీ అవి తమ రాజకీయ లబ్ది కోసం సృష్టిస్తున్న ఈ అవరోధాల వలన రాజధాని నిర్మాణంలో ఆలశ్యం జరిగితే, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుందనే విషయాన్ని కూడా అవి పట్టించుకొకపోవడం చాలా శోచనీయం. కానీ అవిప్పుడు సృష్టిస్తున్న అవరోధాలన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకే సాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాటి వలన మరింత లాభమే జరుగుతుందని చెప్పవచ్చును. అవి పెట్టిన అన్ని అగ్ని పరీక్షలను ఎదుర్కొని రాజధానికి రూపురేఖలు తెచ్చినప్పుడు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరిని దండిస్తారో చాలా తేలికగానే ఊహించవచ్చును.