ఇప్పుడు రాజధాని నిర్మించుకోలేకపోతే...

 

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే నెల 6వ తేదీని శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో అందుకోసం వేగంగా చర్యలు చేపడుతోంది. అన్నిటికంటే ముందుగా ఈ పనికి అవరోధంగా నిలుస్తున్న భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. రాజధాని కోసం భూములు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్న ఉండవల్లి మరియు పెనుమాక గ్రామాలలో రైతులకు వారి సర్వే నెంబర్లు ఆధారంగా ఈరోజు జిల్లా కలెక్టర్ భూసేకరణ కోసం నోటీసులు అందజేయబోతున్నారు. అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వానికి అంగీకార పత్రాలు ఇచ్చి తరువాత హైకోర్టులో పిటిషన్లు వేసిన రైతులకి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. వారి భూములు రాజధాని నిర్మాణం చేయాలనుకొంటున్న ప్రాంతానికి మధ్యలో ఉన్నందునే తప్పనిసరిగా భూసేకరణ చేయవలసి వస్తోందని అధికారులు చెపుతున్నారు.

 

ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించినట్లయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు, ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకే సాగాలని నిశ్చయించుకొంది. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఇటువంటి ప్రజాపయోగమయిన పనులకోసం రైతుల నుండి భూమిని సేకరించేందుకు ప్రభుత్వాలకి అధికారం కల్పించింది కనుక ఈ విషయంలో కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకపోవచ్చును. కానీ, నోటీసులు అందుకొన్న రైతులు మళ్ళీ కోర్టులను ఆశ్రయించడం తధ్యం కనుక ప్రభుత్వానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ భూసేకరణను వ్యతిరేకిస్తున్నాయి కనుక ప్రభుత్వానికి న్యాయపరమయిన ఇబ్బందుల కంటే రాజకీయపరమయిన సమస్యలే అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉంది.

 

రాష్ట్ర ప్రజలలో మంచి ఆదరణ కలిగి ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితో ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. కానీ ఇంతవరకు ఆయన ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. మరి ఆ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలో లేకపోతే మళ్ళీ అకస్మాత్తుగా తుళ్ళూరుకి బయలుదేరిపోయి హడావుడి చేస్తారో తెలియదు. ఏది ఏమయినప్పటికీ ఈ భూసేకరణ ఆఖరు అధ్యాయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా చాలా సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు.

 

ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులు తరపున ఉద్యమిస్తామని చెపుతున్నప్పటికీ, వారి పోరాటాల వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. రాష్ట్ర విభజన తరువాత చెల్లచెదురయిపోయిన కాంగ్రెస్ నేతలను అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి ఈ సమస్య మీద పోరాడి మళ్ళీ ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించవచ్చును. వైకాపా కూడా ఇంచుమించి అదే ఉద్దేశ్యంతో పోరాటానికి సిద్దం కావచ్చును. నిరంతరం ఏదో ఒక ప్రజాసమస్యలపై పోరాడే వామపక్ష పార్టీలు కూడా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి గనుక అవి కూడా ఇందులో పాల్గొనవచ్చును. కనుక ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిపోరాటం చేయక తప్పదు. అయితే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందే ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అటువంటప్పుడు ప్రభుత్వం ముందు నుంచే ఇందుకోసం రాష్ట్ర ప్రజలందరి మద్దతు కూడగట్టినా లేక ఈ విషయం గురించి ముందుగానే ప్రతిపక్షాలతో కూడా చర్చించి వాటి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉన్నా బహుశః సమస్య తీవ్రత ఇంతగా ఉండేది కాదేమో?

 

ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. తెదేపా-బీజేపీల మధ్య మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలయినంత త్వరగా రాజధాని నిర్మించుకోవలసింది పోయి, ఈవిధంగా ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నట్లయితే, ఒకవేళ మిగిలిన ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం చేసుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రజలు ఎవరిని నిందించాలి? రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వాన్నా? లేక ఈ అవరోధాల కారణంగా రాజధాని నిర్మించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలా? లేక తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మాణానికి అవరోధాలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలనా? దీనికి ఇప్పుడు ఎవరు ఎటువంటి సమాధానమయినా చెప్పుకోవచ్చును. కానీ అందుకు బాధ్యులను ప్రజలే గుర్తించి వారిని శిక్షించకుండా విడిచిపెట్టరని అన్ని పార్టీలు గుర్తుంచుకోవడం మంచిది.