ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగేనా?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మించాలని భావించిన తెదేపా ప్రభుత్వం ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూసేకరణకు ప్రయత్నిస్తోంది. అయితే దానికి రైతుల నుండి మిశ్రమ స్పందన వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత నిరాశకు గురయినట్లు కనబడుతున్నారు. బహుశః అందుకే ఆయన ఇప్పుడు గుంటూరు వద్ద రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటునట్లు చెప్పారనుకోవలసి ఉంటుంది. రాజధాని విజయవాడ వద్ద నిర్మిస్తారా? లేకపోతే గుంటూరు వద్ద నిర్మిస్తారా? అనే విషయం పక్కనబెడితే, అందరూ ఊహించినట్లే రాజధాని నిర్మాణానికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారిందని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతాలలో ప్రభుత్వభూములు లేకపోవడం, ఉన్న భూములు రైతులు, రాజకీయ నాయకులు మరియు రియల్టర్ల చేతిలో ఉండటంతో భూసేకరణ చాలా కష్టమవుతోంది.

 

రాజకీయ నాయకులు, రియాల్టర్లు కేవలం లాభార్జన కోసమే అక్కడ భూములపై పెట్టుబడులు పెట్టారు కనుక ప్రభుత్వం వారి భూములకు తగిన వెల కట్టి సొమ్ము ముట్టజెప్పేందుకు సిద్దపడితే వారు తమ భూములను ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. కానీ రైతులకి జీవనాధారమయిన భూమి వారికి ప్రాణంతో సమానం. దానితోనే రైతుల సుఖ దుఃఖాలు అన్నీపెనవేసుకొని జీవిస్తుంటారు. ఆ ప్రాణాన్ని ప్రభుత్వం కోరుతున్నప్పుడు తప్పనిసరిగా అందుకు పరిహారం తిరిగి భూమి రూపంలోనే ఇవ్వడం ద్వారానే రైతును తృప్తి పరిచే అవకాశం ఉంటుంది తప్ప దానికి వెల కట్టి డబ్బు రూపంలో ఎంత పరిహారం చెల్లించేందుకు సిద్దపడినా రైతులు అంగీకరించక పోవచ్చును.

 

అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా అటు రైతులు, ఇటు ప్రభుత్వం ఇరువురూ కూడా పూర్తి ప్రయోజనం పొందేవిధంగా ప్రణాళిక సిద్దం చేసి దాని గురించి మంత్రులు, అధికారులు కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మధ్యలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీ నేతలు కొందరు చేస్తున్న విష ప్రచారం వలన కొందరు రైతులు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సందేహిస్తున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద రాజధాని నిర్మిస్తామని శాసనసభలో ప్రకటించినప్పుడు ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత అందుకు అవరోధాలు సృష్టిస్తుండటం చాలా విచారకరం. రైతులు ల్యాండ్ పూలింగ్ పద్దతిలో ప్రభుత్వానికి తమ భూములు అప్పగించకపోయినట్లయితే, భూసేకరణ పద్ధతి ద్వారా ప్రభుత్వం వారి నుండి బలవంతంగా భూములు గుంజుకొంటుందని తన మీడియా ద్వారా ప్రచారం చేయడం కూడా రైతులలో లేని భయాలు రేకెత్తించింది.

 

అందువలన ప్రభుత్వం వారికి అర్ధం కాని లెక్కలు చెప్పడం కంటే ముందుగా వారిలో ప్రభుత్వం పట్ల ఏర్పరచబడిన ఈ అపనమ్మకాన్ని తొలగించి వారి భయాలు పోగొట్టి వారి నమ్మకం పొందే ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. అంతే కాదు రైతులకి తమ పంట భూములపై ఉన్న మమకారం, దానితో వారికున్న అనుబందాన్నికూడా ప్రభుత్వం గుర్తించి మన్నించివలసి ఉంటుంది.ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కనుక వారి ఆవేదనను, భూమితో వారికున్న అనుబంధాన్ని, దానిపైనే ఆధారపడి ఉన్న వారి జీవితాలను అన్నిటినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ప్రతిపాదనలు చేసినట్లయితే బహుశః వారు తప్పకుండా ప్రభుత్వానికి సహకరించవచ్చును.

 

ఒకవేళ రైతులు అంగీకరించకపోయినట్లయితే ప్రభుత్వం కూడా మొండిపట్టుదలకు పోవడం కంటే, రాజధాని నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించడం మంచిది. లేదా విజయవాడ-గుంటూరు నగరాలలో ఉన్న పరిమిత ప్రభుత్వ భూములలో కేవలం సచివాలయం, శాసనసభ, ముఖ్యమంత్రి అధికార నివాసం మరియు ప్రభుత్వాధికారుల నివాసాలు వంటి ముఖ్యమయిన భవన సముదాయాలతో కూడిన చిన్న రాజధానిని మాత్రమే అక్కడ నిర్మించి, శివరామకృష్ణన్ కమిటీ సూచించిన విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను, హైకోర్టు వంటి వాటిని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వికేంద్రీకరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించ వచ్చును.

 

తద్వారా అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందడమే కాకుండా రైతులతో సహా అన్ని జిల్లాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. ఏమయినప్పటికీ, ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం తన ముందు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. భూసేకరణ అనేది చాలా సున్నితమయిన, రైతుల భావోద్వేగాలతో, జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక ప్రభుత్వం కూడా అంతే సున్నితంగా వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే అది కొత్త సమస్యలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.