ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దు

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని ఏర్పాటుకు అవసరమయిన సూచనలు చేసేందుకు నియమింపబడిన శివరామ కృష్ణన్ కమిటీ నిన్న కేంద్ర హోం శాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలు, సూచనలు:

 

1. వినుకొండ-మార్టూరు రాజధానికి అనువయిన ప్రాంతం. 2. విశాఖలో ఐటీ హబ్ మరియు హైకోర్టు ఏర్పాటు (అనంతపురం లేదా కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు) 3. రాయలసీమలో ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ఏర్పాటు. 4.శ్రీకాళహస్తిలో రైల్వే జోన్ ఏర్పాటు. 5. రాజధాని పరిపాలనా కేంద్రంగా ఉండాలి కనుక అక్కడే శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం వగైరాలు ఏర్పాటు.5. ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసుకోవాలి. 6. స్మార్ట్ సిటీ లేదా సూపర్ సిటీ ఏర్పాటు అనవసరం. 7. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే నాలుగు భాగాలుగా చేసుకుని పరిపాలనను, పరిశ్రమల ఏర్పాటును వికేంద్రీకరించినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి.

 

అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెపుతూ కమిటీ సభ్యులను ప్రభావితం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఈ నివేదిక నిరూపించింది.

 

విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం రాజధానికి ఏ మాత్రం అనువయినది కాదని, ఒకవేళ అక్కడే రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఆర్ధిక, సామాజిక, పర్యావరణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో వినుకొండ-ప్రకాశం జిల్లాలో మార్టూరు మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువయిన ప్రాంతమని తేల్చి చెప్పింది. మొదటి నుండి విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని ఏర్పాటు చేస్తామని గట్టిగా చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.

 

అభివృద్ధిని వికేంద్రీకరించాలనే కమిటీ సలహాపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ లేకపోయినప్పటికీ, రాజధాని విషయంలో కమిటీ సలహాపై అప్పుడే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి అనుకూల, ప్రతికూల వాదనలు, దానిపై వాడివేడి చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఇదివరకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు, తమ అభిప్రాయాన్ని బహుశః ఆయనకు అప్పుడే తెలియజేసి ఉండి ఉండవచ్చును. కానీ ఆయన ప్రజాభీష్టం మేరకే రాజధాని ఏర్పాటవుతుందని, రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి అని చెప్పడం చూస్తే బహుశః ఆయన విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునే ఆవిధంగా చెపుతున్నారని అనుకోవలసి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పంతానికి, ప్రతిష్టకు పోకుండా ఆలోచించినట్లయితే, నిపుణుల కమిటీ సూచించిన ప్రాంతం కూడా అన్ని విధాల అనువుగా ఉంది, ఇంచుమించు రాష్ట్రానికి మధ్యలోనే ఉంది కనుక అక్కడే రాజధాని ఏర్పాటుకు అంగీకరించినట్లయితే అనేక తీవ్ర సమస్యలను నివారించుకోవచ్చును.

 

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సలహాను పెడచెవిన పెట్టి రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలోనే నిర్మించాలని సిద్దపడితే బహుశః అధికార పార్టీ నేతలందరూ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తప్పుపడుతూ విజయవాడకు అనుకూలంగా తమ వాదనలు గట్టిగా వినిపించవచ్చును. అవసరమయితే తమ వాదనకు అనుకూలంగా గట్టిగా వాదించేందుకు నిపుణులను రంగంలోకి దింపవచ్చును. అప్పుడు ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఊరుకోవు కనుక ఈ అంశంపై కూడా రాజకీయాలు మొదలుపెడితే, ఇది కూడా రాష్ట్ర విభజన అంశం లాగే వివాదాస్పదంగా మరి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు కమిటీ చెపుతున్న సమస్యలే కాకుండా అనేక కొత్త సమస్యలు కూడా ప్రభుత్వం తలకు చుట్టుకోవడం ఖాయం. కనుక, ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయడం కంటే, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కమిటీ చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించడం మంచిది. ఒకవేళ దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే ప్రభుత్వమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమయిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం మంచిది. కానీ ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేసినట్లయితే ఊహించని అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఇది మరింత జటిలమయిన సమస్యగా మారే ప్రమాదం ఉంది కనుక చేతులు కాల్చుకోకుండా ముందే జాగ్రత్త పడటం మేలు. రాష్ట్ర విభజన రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితిని, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని స్వార్ధ రాజకీయ నాయకుల మాటలకు లొంగకుండా ఈ విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం.