ట్రంప్ టారిఫ్ వార్.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలి.. ఆనంద్ మహీంద్రా
posted on Aug 7, 2025 1:07PM

క్షీర సాగర మథనంలో అమృతం పుట్టినట్లుగా ట్రంప్ సుంకాల సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొంటే భారత్ కు కూడా అమృతం వంటి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నదుగ్ధతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలను 50 శాతానికి పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలనీ, ఇందు కోసం ఇండియా బలంగా రెండు అడుగులు ముందుకు వేయాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రారంభించిన టారిప్ వార్ తీవ్ర పరిణామాలకు దారి తీసు అవకాశాలున్నాయన్న ఆయన.. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెట్టాయనీ, ఫలితంగా ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయన్నారు.
భారత్ కూడా ఈ సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలన్నారు. 1991లో భారత్ లో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభం లిబరలైజేషన్ దారి తీసిందనీ, అలాగే ఇప్పుడు ట్రంప్ సుంకాల కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులను నుంచి బయటపడి కొత్త అవకాశాలకు బాట ఏర్పడుతుందనీ అన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సత్వరమే మెరుగుపరచాలని సూచించారు. అలాగే టూరిజం రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.