అబద్ధం ఓ అందమైన అలవాటు


కొంతమంది పదేపదే అబద్ధాలు ఎందుకు చెబుతుంటారు? ఏదో అలవోకగా అడేసిన చిన్నపాటి అబద్ధం గొలుసుకట్టు అబద్ధాలకి ఎందుకు దారి తీస్తుంది? ఇలా అబద్ధాల చెప్పే అలవాటుని శాస్త్రీయంగా రుజువుచేయవచ్చా?... ఇలాంటి సందేహాలే వచ్చాయి లండన్‌కు చెందిన ‘టాలీ షారోట్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్తకి. తన సందేహాలు రుజువు చేసుకునేందుకు ఆయన ఓ చిత్రమైన పరిశోధనని చేపట్టారు. 

 

చిల్లర డబ్బుల పరిశోధన.

టీలీ షారోట్ తన పరిశోధన కోసం 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఒక 80 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీళ్లకి చిల్లర డబ్బులు ఉన్న ఒక సీసాను చూపించి అందులో ఉన్న డబ్బుల గురించి ఇతరులకి చెప్పమన్నారు. అవతలివారికి డబ్బు గురించి లెక్కలు చెప్పేటప్పుడు అబద్ధం చెప్పే స్వేచ్ఛని కూడా ఇచ్చారు. అయితే ఇందులో మూడురకాల పరిస్థితులను కల్పించారు. కొన్ని సందర్భాలలో అబద్ధం వల్ల చెప్పినవాడికీ, విన్నవాడికీ కూడా మేలు జరుగుతుంది. మరికొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఒకరికి లాభం జరగడమే కాదు, అవతలివారికి నష్టం కూడా కలుగుతుంది.

 

మెదళ్లని పరిశీలించారు

అభ్యర్థులు ఇలా పోటీలు పడి అబద్ధాలు చెప్పే సమయంలో వారి మెదడుని అత్యాధునిక fMRI స్కానింగ్‌ ద్వారా పరీక్షించారు. మెదడులోని ‘అమిగ్డలా’ అనే కేంద్రం భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అబద్ధం చెప్పిన ప్రతిసారీ ఈ అమిగ్డలాలో ఎలాంటి స్పందనలు నమోదయ్యాయో పరిశోధకులు గమనించారు. చిత్రం ఏమిటంటే తొలిసారి అబద్ధం చెప్పినప్పుడు ఈ అమిగ్డలా చాలా తీవ్రంగా స్పందించింది. అబద్ధం చెప్పేందుకు అతను ఊగిసలాడుతున్నట్లు దీనివల్ల తేలిపోయింది. కానీ అబద్ధాలు సాగుతున్నకొద్దీ దీని ప్రతిస్పందన తగ్గిపోయిందట. దీనివలన అభ్యర్థులు మరింత పెద్ద అబద్ధాన్ని కూడా అలవోకగా చెప్పడాన్ని గమనించారు. పైగా తనకి లాభం కలిగేలా అబద్ధం చెప్పినప్పుడు అమగ్డోలా స్పందన నామమాత్రమగానే మిగిలిపోతోందని తేలింది. అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం అభ్యర్ధులు చాలా తేలికగా అబద్ధాలు చెప్పగలిగారన్నమాట.

 

ప్రయోజనాలు

మనిషి అబద్ధం చెప్పినప్పుడు అతని మెదడు ఎలా స్పందిస్తుందనే విషయం మీద ఇదే తొలి పరిశోధన అని చెబుతున్నారు. ఒక వ్యక్తి చెప్పే మాటలు నిజమా కాదా అని నిర్ణయించేందుకు మున్ముందు లై డిటెక్టరు పరీక్షల బదులు ఇలాంటి పరీక్ష మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ‘చిన్నచిన్న అబద్ధాలతో మొదలయ్యే ఒక ప్రయాణం ఒకోసారి తీవ్రమైన నేరాలకు ఎలా దారితీస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది’ అంటున్నారు టాలీ షారోట్.

 

- నిర్జర.