వివేకా హత్య కేసు.. అమిత్ షా ఫోకస్ !

posted on: May 17, 2022 11:19AM

సీఎం వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. సదరు కేసు ఓ కొలిక్కి అయితే రాలేదు. దీంతో ఈ హత్య కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్కరు సందేహించాల్సిందే. అయితే ఈ హత్య కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. సీబీఐ అధికారుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం.. ఆ క్రమంలో ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు.. ఈ హత్యలో పాల్గొన్న పాత్రధారులు.. ఈ హత్య కోసం చేతులు మారిన కోట్ల రూపాయిల సూపారీ.. ఇలా అన్ని విషయాలు బహిర్గతమైనా.. ఆ తర్వాత సీబీఐ అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకోనూ లేదు.. అరెస్ట్‌లు చేయనూ లేదు.

దీంతో ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ... అసలు ఏం చేస్తోందనే ఓ ప్రశ్న అయితే అటు వివేకా అభిమానులనే కాదు.. ఇటు కడప జిల్లా వాసులను సైతం వేధిస్తోంది. ఈ వివేకా హత్య కేసులో బీజేపీ పెద్దలు లేదా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటేనే కానీ.. ఈ కేసు విచారణలో స్పీడ్ పెరిగి.. నిందితులు ఎవరో బయటకు వస్తారనే ఓ చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. అలా అయితేనే వివేకా కుమార్తె వైయస్ సునీతకు సైతం న్యాయం జరగుతోందనే ఓ టాక్ కూడా నడుస్తోంది. 

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు పులివెందుల నియోజకవర్గంలోని  చక్రయాపేట మండల వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి కడప జిల్లా దువ్వూరు, ఎర్రగుంట్ల, చక్రాయపేట మీదుగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వరకు అంటే దాదాపు 143 కిలోమీటర్ల మేర 350 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో ఈ రహదారి విస్తరణ పనుల కాంట్రాక్ట్‌ను ఓ ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీ దక్కించుకొంది. 

అయితే ఈ పనుల్లో తమ వాటా కింద 5 కోట్ల రూపాయిలు లంచంగా ఇవ్వాలంటూ వైయస్ కొండారెడ్డి ...సదరు రహదారి పనులు చేస్తున్న వారిని డిమాండ్ చేయడం..  దీంతో వారు... కాంట్రాక్ట్ కంపెనీ పెద్దలకు ఫిర్యాదు చేయడం.. దాంతో కాంట్రాక్ట్ కంపెనీవారు అసలే కర్ణాటకలోని బీజేపీ పెద్దలకు చాలా క్లోజ్‌ని సమాచారం. ఈ నేపథ్యంలో సదరు బీజేపీ పెద్దలు.. హస్తినలోని బీజేపీ అగ్రనేతలకు అసలు విషయం వివరించడంతో.. వారు వెంటనే రంగంలోకి దిగి.. ఏపీ ప్రభుత్వంలోని పెద్ద సార్‌కు గట్టిగా తలంటారట. దీంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిన సదరు పెద్ద సార్.. వెంటనే వైయస్ కొండారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం.. ఆ వెంటనే అతడిని అరెస్ట్ చేసి.. రాయచోటి జైలుకు తరలించడం.. ఆ క్రమంలోనే వైయస్ ఫ్యామిలీలోనే ఇంటి పోరు మొదలుకావడం.. చక చకా జరిగిపోయాయి.  ఆ తర్వాత వైయస్ కొండారెడ్డికి బెయిల్ మీద విడుదల అయిన గంట సేపటికే అతడిపై జిల్లా నుంచి బహిష్కరణ వేటు ఎస్పీ వేస్తూ ఆదేశాలు జారీ అయినాయి. 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పూర్తి అయ్యేవరకు ప్రభుత్వంలో పెద్ద సార్.. కంటి మీద కునుకే లేదని సమాచారం. ఓ వేళ ఇంటి పోరు అని చెప్పి వైయస్ కొండారెడ్డిని విడుదల చేస్తే..హస్తినలోని కమలదండుతో తట్టుకోవడం కష్టమనే ఓ కాన్సెప్ట్‌తో సదరు పెద్ద సార్.. ఇలా స్కెచ్ వేశారని సమాచారం.

ఇదే తరహాలో కర్ణాటకలోని బీజేపీ పెద్దలు హస్తినలోని పెద్దలను కలిసినట్లుగా వివేకా కుమార్తె వైయస్ సునీతమ్మ కూడా ఒకటికి రెండు సార్లు ఢిల్లీలోని పెద్దలను కలిస్తేనే.. కానీ వివేకా హత్య కేసు సాధ్యమైనంత త్వరగా తెమలదనే ఓ ఛర్చ అయితే కడప జిల్లాలో చాలా జోరుగా నడుస్తోంది. అవసరం అయితే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను సైతం కలిసి.. ఈ హత్య  కేసు దర్యాప్తు వేగవంతం చేయమనాలంటూ ఓ వినతి పత్రాన్ని సైతం వారికి ఇస్తేనే కానీ ఈ కేసు దర్యప్తులో స్పీడ్ పెరుగుతోందనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో సైతం ఉపందుకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...