మోదీ ఆమోదంతో యూపీని ఏలనున్న ఐఐటీ ఇంజనీర్!


మనోజ్ సిన్హా... ఈయనెవరో తెలుసా? పెద్దగా తెలిసే అవకాశం లేదు! కాని, శనివారం తరువాత ఈయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచం ముందుకు రానున్నారు! అతి పెద్ద రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన బలప్రదర్శనతో మెజార్టీ సాధించిన కమలదళం ఎట్టకేలకు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ధారించుకుందని డిల్లీ టాక్. ఇంకా అధికారికంగా మనోజ్ సిన్హా పేరు అనౌన్స్ కాలేదు కాని... ఆయన ముఖ్యమంత్రి అని దాదాపు ఖరారు అయిపోయింది.

 

యూపీలో బీజేపిని మోదీ, అమిత్ షా ముందుండి గెలిపించారు. కాని, రాష్ట్ర స్థాయిలో కమల వికాసానికి తోడ్పడిన నేతలు చాలా మంది వున్నారు. యూపీ బీజేపి అధినేత కేశవ్ ప్రాద్ మౌర్యా మొదలు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వరకూ అందరూ ఉత్తర్ ప్రదేశ్ నేతలే! నిజానికి ప్రస్తుతం నడుస్తోన్న సోషల్ మీడియా కామెడీ ఏంటంటే.. యూపీలో బీఎస్పీ గెలుచుకున్న ఎమ్మెల్యేల కంటే బీజేపీలో వున్న సీఎం క్యాండిడేట్లు ఎక్కువని! అంత మందిలో మోదీషా ద్వయానికి నచ్చిన సైలెంట్ కిల్లర్ మనోజ్ సిన్హా!

 

మనోజ్ సిన్హాని సైలెంట్ కిల్లరని ఎందుకు అనాలి? ఎందుకంటే, మొదట్నుంచీ ఆయన స్టైలే అది! మౌనంగా తన పని తాను చేసుకుపోతుంటాడు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ పట్టభద్రుడు! సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటీ సర్టిఫికెట్ పొందిన మనోజ్ సిన్హా ప్రస్తుతం కేంద్రంలో స్వతంత్ర హోదా కలిగిన మంత్రి. ఇటు కమ్యూనికేషన్స్ శాఖని, అటు రైల్వే శాఖని ఆయన ఏక కాలంలో నిర్వర్తిస్తున్నాడు! ఆ క్రమంలోనే మనోజ్ సిన్హా ఇటు కమ్యూనికేషన్స్ కు సంబంధించి కార్పోరేట్లను, అటు రై్ల్వేస్ కు సంబంధించి యూనియన్ లీడర్లను ఏక కాలంలో మ్యానేజ్ చేశాడు. అదే మోదీకి, అమిత్ షాకు ఆయన మీద ప్రత్యేక నమ్మకం కలగటానికి కారణం. ఇక ఐఐటీ పూర్తి చేసి ఇంజనీర్ అయినప్పటికీ పక్కా కాషాయ స్టైల్లో ధోతీ కట్టి జుబ్బా వేసుకుంటాడు భూమిహర్ బ్రాహ్మణుడైన సిన్హా!

 

టాలెంట్, లుక్స్, పర్ఫామెన్స్... ఏ విధంగా చూసినా మనోజ్ సిన్హాకు అన్ని అర్హతలు వుండటంతో మోదీ, షా అతడ్నే లక్నో పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, సిన్హా పేరే ఫైనల్ అయితే మాత్రం ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే, దశాబ్దాలుగా యూపీలో సీఎం ఎవరన్నది నిర్ణయిస్తోంది కులమే! ప్రతిభ, సత్తా వంటి వాటికి అక్కడ ఏ విలువా వుండదు. పార్టీ ఏదైనా కులాల లెక్కలు వేసుకుని ఏదో ఒక బలమైన సామాజిక వర్గానికే సీఎం కుర్చీ కట్టబెట్టేస్తుంటారు. అలా చూస్తే మనోజ్ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ లో ఏ ప్రభావమూ చూపని భూమిహర్ వర్గానికి చెందిన వాడు! అయినా మహారాష్ట్రలో ఫడ్నవీస్, జార్ఖండ్ లో రఘుబర్ దాస్, హరియాణాలో కట్టర్... ఇలా అనూహ్య ముఖ్యమంత్రుల్ని పదవుల్లో కూర్చోబెట్టిన మోదీ యూపీలో కూడా అదే చేయబోతున్నారు! సిన్హా ఎవరు అని కాకుండా ... ఏంటి అని పరిక్షించి బాధ్యతలు అప్పజెబుతున్నారు!

 

ఉత్తర్ ప్రదేశ్ కవల రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో కూడా మోదీషా టాలెంట్ కే సీఎం సీటుని అప్పజెప్పాలని డిసైడ్ అయ్యారట. త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి అవుతారని బలంగా వినిపిస్తోంది. ఆయన గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసి సత్తా చాటాడు. అలాగే, పార్టీ కోసం ఢిల్లీలోనూ అనేక బాధ్యతలు చేపట్టి మోదీకి దగ్గరయ్యాడు. అలా సంపాదించిన నమ్మకమే ఇప్పుడు రావత్ ని ఉత్తరాఖండ్ సెక్రటేరియల్ దిశగా రారామ్మంటోందని అభిప్రాయం!