కాలుష్యంతో ఆడవారిలో మతిమరపు

 

జీవితం పొగచూరిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని పంచభూతాలన్నీ కలుషితం అయిపోయాయి. కానీ ఈ కాలుష్య ప్రభావం స్త్రీల మీద ఎక్కువేమో అన్న అనుమానాలను కలిగిస్తోంది ఓ పరిశోధన.

 

సహజంగానే స్త్రీల మీద అల్జీమర్స్ దాడి ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలలో ఉండే APOE-E4 అనే ప్రత్యేక జన్యువు కారణంగానే వారిలో అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తోంది ఈమధ్యనే బయటపడింది. ఇక దానికి తోడు కాలుష్యం కూడా వారిలో అల్జీమర్స్కి కారణం అవుతోందా అని పరిశీలించే ప్రయత్నం చేశారు కొందరు నిపుణులు. ఇందుకోసం వారు అమెరికా ప్రభుత్వం తరపున నమోదైన 3,647 మంది స్త్రీల ఆరోగ్యాన్ని ఓ 15 ఏళ్ల పాటు పరిశీలించారు.

 

వాహనాల రద్దీ లేదా పవర్ ప్లాంట్స్కి దగ్గరలో ఉండేవారు తీవ్రమైన వాయుకాలుష్యానికి గురవుతారన్న విషయం తెలిసిందే! ఇలాంటి వాతావరణంలో 2.5 P.M మాత్రమే ఉండే ధూళికణాలు విహరిస్తూ ఉంటాయి. మనిషి వెంట్రుక ఓ 70 మైక్రోమీటర్లు అనుకుంటే ఇందులో ముప్ఫయ్యో వంతులో ఈ ధూళికణాలు ఉంటాయన్నమాట. ఇంత సన్నగా ఉండే ధూళికణాలు ఏకంగా మన మెదడులోకే చొరబడిపోయే ప్రమాదం ఉంది. మెదడులోకి ఇలా చొరబడిన కణాలను ఎదుర్కొనేందుకు అక్కడ ఏకంగా ఓ యుద్ధమే జరుగుతుంది. ఫలితంగా మెదడు ఆకారంలో మార్పులు సంభవిస్తాయి.

 

ధూళికణాల కారణంగా మెదడులో జరిగే మార్పుల వల్ల మతిమరపు, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలాంటి ప్రదేశాలలో నివసించే మహిళలు దాదాపు 92 శాతం అధికంగా అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా APOE-E4 జన్యువు కనిపించే స్త్రీలలో ఈ ప్రమాదం ఎక్కువట. మగవారిలో ఈ జన్యు ప్రభావం చాలా తక్కువ కాబట్టి... వారికి కాలుష్యం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడకపోవచ్చు అని భావిస్తున్నారు.

 

ధూళికణాల వల్ల మన మెదడులోని కొన్ని ముఖ్యభాగాలు ప్రభావితం అవుతాయని ఇంతకుముందే తేలింది. ఆలోచనా శక్తి మందగిస్తుందనీ, విచక్షణలో మార్పులు వస్తాయనీ పరిశోధకులు నిరూపించారు. అయితే ఇప్పుడు ఏకంగా అల్జీమర్స్, అది కూడా ఆడవారి మీద దాడిచేయనుందని తేలడంతో... ఈ పరిశోధన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేలా కఠినమైన చట్టాలను రూపొందించాలన్న వాదనకు బలం చేకూరుతోంది.

- నిర్జర.