గ్రహాంతరవాసులు ఆగ్రహిస్తే... మన గతేంటి?

మీరు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తారా?చూసేవారైతే మీకు ఏలియన్స్ గురించి ఎంతో కొంత తెలిసే వుంటుంది!ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు.వారి గురించి పాళ్చాత్యులకి ఎక్కడలేని ఆసక్తి.ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీయటమే కాదు సైంటిపిక్ గా స్టడీ కూడా చేస్తుంటారు!నాసా లాంటి సంస్థల పెద్ద పెద్ద ఆశయాల్లో గ్రహాంతరవాసులతో సంబంధాలు పెట్టుకోవటం ఒకటి...
గ్రహాంతరవాసులు నిజంగా వుంటారా?ఖచ్చితంగా వుంటారని ఈ మధ్య ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు పదే పదే ఏలియన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సైన్స్ ఎదుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు భూమిని దాటి ఆకాశంలోకి తమ చూపు పోనిచ్చారు.అప్పుడు వారికి వున్న ఆవగాహన పరిమితం.సూర్యుడి చుట్టూ వున్న సౌర కుటుంబం గురించే పెద్దగా ఏమీ తెలిసేది కాదు.కాని, గడిచిన వందేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది.చంద్రుడిపై కాలుపెట్టడంతో పాటూ అంగారకుడి వైపు దూసుకుపోతున్నాం.అదే సమయంలో నిజంగా మనముంటోన్న విశ్వం ఎంతటి అనంతమైందో మెల్ల మెల్లగా తెలుస్తోంది!
శాస్త్రవేత్తలు మొదట మన భూమీ, ఇతర గ్రహాలకు పరిమితం అయినా రాను రాను ఇతర నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమి వంటి గ్రహాలపై చూపు పెట్టారు.దీని వల్ల గత కొంత కాలంగా సైంటిస్టులందరికీ కలిగిన ఏకాభిప్రాయం ఏంటంటే సృష్టిలో మనిషి మాత్రమే తెలివైన జీవి కాడు.ఇంకా అనేక గ్రహాల్లో అనేకానేక ఇంటలిజెంట్ జాతులు వున్నాయి.వారితో మనకు, మనతో వారికి ప్రస్తుతానికి సంబంధాలు లేవు. అంతే... 
విశ్వంలో ఎక్కడో ఓ చోట గ్రహాంతర వాసులు వుంటారని శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగాక వాళ్లని కనుక్కొనే దిశగా ప్రయోగాలు మొదలయ్యాయి. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే బలమైన టెలిస్కోపులతో , వ్యోమ నౌకలతో గ్రహాంతరవాసుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఒకవేళ వాళ్లలో ఎవరైనా మన లాంటి తెలివైనా వారో, లేక మనకంటే ఎక్కువ తెలివైన వారో అయితే మనం వున్నామని పసిగట్టేలా బలమైన కిరణాలు విశ్వంలోకి వెదజల్లుతున్నారు.రకరకాల శక్తివంతమైన రేస్ ని ఇప్పటికే సైంటిస్టులు ఆకాశంలోకి గురి పెట్టి పంపుతున్నారు. ఇవ్వి ఒకవేళ ఎక్కడో వున్న నాగరికులైన గ్రహాంతరవాసులకి తారసపడితే వాళ్లు రీసీవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ చేస్తారని ఖగోళవేత్తల అభిప్రాయం... 
గ్రహాంతరవాసులతో కమ్యూనికేషన్... ఇది పైకి వినటానికి బాగానే వున్నా... చాలా పెద్ద ప్రమాదమని హెచ్చరిస్తున్నాడు స్టీఫెన్ హాకింగ్!బ్లాక్ హోల్స్ గురించి ఎన్నోసంచలన విషయాలు చెప్పిన ఆయన గ్రహాంతరవాసులు బోలెడు మంది వుంటారని అంటున్నాడు. కాకపోతే, వారితో వెనుకా ముందు ఆలోచించకుండా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మానవ నాగరికతకే ప్రమాదం రావొచ్చని అభిప్రాయపడుతున్నాడు.గ్రహాంతరవాసులు మనకంటే వైజ్ఞానికంగా ఉన్నతమైన స్థితిలో వుంటే... అంతకుమించి వారు మనతో మంచిగా వుంటారనే గ్యారెంటీ ఏంటి? ఇదీ స్టీఫెన్ హాకింగ్ ప్రశ్న.ఒకప్పుడు ఉత్తర,దక్షిణ అమెరికాల్లోని స్థానికులు ప్రశాంతంగా బతుకుతుంటే యూరోపియన్లు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ తరువాత అక్కడి స్థానికుల్ని హింసాయుతంగా నిర్మూలించేశారు. అదే గ్రహాంతరవాసుల విషయంలో కూడా జరగొచ్చని స్టీఫెన్ హాకింగ్ అంటున్నాడు.వాళ్లు మనకంటే తెలివైన, బలమైన వాళ్లైతే మనల్ని క్షేమంగా వుండనిస్తారని గ్యారెంటీ లేదంటున్నాడు!
స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టు... నిజంగా గ్రహాంతర వాసులు మన మీద దాడులు చేస్తారా చేయరా ఇప్పుడే చెప్పలేం.కాని, ఏలియన్స్ ని కలుసుకోవాలన్న తాపత్రయం మాత్రం ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ వుండాలి. ఎందుకంటే, భూమ్మీద మనలో మనకి కోటి విబేదాలు వుండవచ్చు. కాని, ఎక్కడ్నుంచో వచ్చిన గ్రహాంతర జీవికి మనమంతా ఒకేలా కనిపిస్తాం. మానవ ఆకారంలో వున్న శత్రువులం. కాబట్టి ఏలియన్స్ ని మనల్ని ఏమైనా చేయవచ్చు!సో కేర్ ఫుల్ గా ముందుకు పోవాలన్నమాట!