అఖిలేష్ దేవోభవ

 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అఖిలభారత యాదవ సంఘం సభకి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకొని, అక్కడి నుండి నేరుగా ప్రతిపక్ష నేత చంద్రబాబుని కలుసుకొని ఆయన పాదయాత్రను మెచ్చుకొని, ఆసందర్భంగా ఆయన ప్రకటించిన బిసి డిక్లరేషన్, బిసిలకు వంద సీట్లు వంటి విధానాలను కూడా అదే నోటితో మెచ్చుకొని, ఆతరువాత కేంద్రమంత్రి చిరంజీవిని కలిసి కబుర్లు చెప్పుకొని అందరి దగ్గరా చాయ్ పానీలు సేవించి, నొప్పింపక తానొవ్వక అన్నట్లు అందరినీ సంతృప్తి పరిచారు. కానీ, ఆయనను కలిసిన తెలంగాణ జెయేసి నేత శ్రీనివాస గౌడ్ తెలంగాణకు మద్దతు ఈయమని విజ్ఞప్తి చేసినప్పుడు మాత్రం తాము చిన్న రాష్ట్రాలను వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పి ఆయనను నిరాశపరిచారు. అందరినీ మెచ్చుకొని వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ వరదలలో సహాయ చర్యలు సరిగ్గా చెప్పట్టలేకపోయిందని ఒక డైలాగ్ వదలి కేంద్రరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు రెంటికీ ఒకేసారి  చురకలు వేసి తానూ కూడా తన తండ్రి ములాయం సింగుకి తగ్గ కొడుకునేనని నిరూపించుకొన్నారు.