ఆసియాకప్.. సూర్య ప్రతాపంతో భారత్ ఘనవిజయం
posted on Sep 1, 2022 9:57AM
పాకిస్థాన్‌పై చివరంటా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో గెలిచిన భారత్ తన రెండో మ్యాచ్‌లో హాం కాంగ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. హాంకాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్ గెలిచినా హాంకాంగ్ బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. మొదటి ఐదారు ఓవర్లలో హాంకాంగ్ బౌలర్లు కొంత భారత్ స్టార్ ఓపెనర్లు కెప్టెన్ శర్మ, రాహుల్‌ను కట్టడి చేసినట్టు కనిపించారు. క్రమేపీ భారత్ బ్యాటర్లు విజృంభించారు. ఫోర్లు సిక్స్‌లతో బ్యాటింగ్ రుచి చూపించారు. దురదృష్ట వశాత్తూ రోహిత్ శర్మ ఓ మంచి సిక్స్ కొట్టబోయే ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ వస్తూనే కాస్తంత ధాటిగా ఆడు తూ సింగిల్స్, డబుల్స్ మీద దృష్టిపెట్టడంతో స్కోర్ వేగం పుంజుకుంది. రాహుల్ సిక్స్‌లు, ఫోర్లతో తన పాత ఫామ్ మళ్లీ రుచి చూపించాడు.
అతని తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం కోహ్లీకి ధీటుగా వస్తూనే ఫోర్లు, సిక్స్‌లూ బాది హాంకాంగ్ బౌలర్లకు లైన్ మర్చిపోయేలా చేశాడు. భారీ సిక్స్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకు న్నాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో సూర్య కుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్ అర్షద్‌పై విరుచుకు పడ్డాడు. ఆ జోరులోనే భారత్ 2 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. సూర్య 26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో బ్యాట్‌ను గట్టిగా ఝుళిపించి 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. కింగ్ కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలి చాడు.
193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. బాబర్ హయత్ 41 పరుగులు, కించింత్ షా 30 పరు గులు, మెకెనీ 16 పరుగులు, జీషన్ అలీ 26 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవీష్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజాకత్ ఖాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ సూపర్-4కు చేరింది. దాదాపుగా భారత్, పాక్ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్ జట్టు రోహిత్ సేనకు ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 98 పరుగుల భాగస్వామ్యం టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.