TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ వేడెక్కిన తెలంగాణ..హైకమాండ్‌ లో కలవరం

Published on: Wed Mar 28, 2012 9:48AM

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నుంచి పెరుగుతున్న తలనొప్పులతో ఢిల్లీ హైకమాండ్ హైరానా పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఫిర్యాదులు, మళ్లీ వేడెక్కిన తెలంగాణ రగడ హైకమాండ్‌కు తలనొప్పిగా తయారైంది. కిరణ్‌కుమార్ రెడ్డిని మార్చటంతో పాటు, తెలంగాణ వివాదంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే అభిప్రాయానికి హైకమాండ్ వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంతోపాటు, 18 విధానసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత రాష్ట్రంలో మేజర్ ఆపరేషన్ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు వివాదంపై వెంటనే ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించటంతోపాటు, కిరణ్‌కుమార్ రెడ్డిలో మార్పు తీసుకురాకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతోపాటు రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఫిర్యాదు చేయటం గమనార్హం. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితోపాటు సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి పనితీరును విమర్శించటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో పడిందని అంటున్నారు. ఏడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలి. ఆయన ఏకపక్ష విధానం వల్లే పార్టీ ఓడిందని పలువురు ఎంపీలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 18 స్థానాలకు త్వరలో జరిగే ఉపఎన్నికల్లో కూడా పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనక తప్పదని ఎంపీలు ఆజాద్‌కు స్పష్టం చేశారు. ఇదిలావుంటే, తెలంగాణలో మళ్లీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడటం కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవర పరుస్తోంది. సోనియాతోపాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా తెలంగాణ అంశంపై దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. తెలంగాణ వివాదంపై పార్టీ త్వరలోనే ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.