TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాదులో క్రీ.శ. 7వ శతాబ్ది చాళుక్య ఆనవాళ్లు

Published on: Fri Jan 31, 2025 9:27AM

మంచిరేవులలో బాదామీ చాళుక్య ఆనవాళ్లు!
 కాపాడుకోవాలంటున్నప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ఈమని శివనాగిరెడ్డి
 

హైదరాబాద్ నగర శివారు గ్రామమైన మంచిరేవులలో చాళుక్య అనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మూసీ పరివాహక గ్రామాల్లో చారిత్రక అనవాళ్లను గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు మంచిరేవుల గ్రామంలో పర్యటించి ఆంజనేయస్వామి దేవాలయంలో రావి చెట్టు కింద ఉన్న క్రీ.శ. 7వ శతాబ్దికి చెందిన దేవాలయ మండపం గోడలకు బిగించే రాతి కిటికి, ఆలయంలోపల గోడ పక్కనే వినాయక విగ్రహం ఉన్నాయని చెప్పారు.

వినాయకుడు రెండు చేతులు మాత్రమే కలిగి తలపై కిరీటం లేకుండా లలితాసనంలో కూర్చొని ఉన్నాడనీ, అలాగే ఎర్ర ఇసుకరాతితో చెక్కిన కిటికీ చుట్టూ సాదా చట్రం, మధ్యలో గాలి, వెలుతురు ప్రసరించడానికి మూడు వరుసలలో ప్లస్ ఆకారంలో 18 కంతలు, వాటి మధ్య చక్కటి పద్మం డిజైన్లు ఉన్నాయనీ, వినాయకుని ప్రతిమా లక్షణం, కిటికీ వాస్తు విన్యాసం, బాదామీ చాళుక్యుల కాలంనాటివని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ రెండు కళాఖండాల పైన రంగులు తొలగించి, పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తలకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు కళాఖండాలు హైదరాబాద్ నగర చరిత్రను క్రీ.శ. 7వ శతాబ్దికి, అంటే ఇప్పటికీ 1300 సం||ల క్రితానికి తీసుకెళ్తున్నాయని , గతంలో బేగంబజారులో క్రీ.శ. 612 నాటి బాదామి చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి రాగిరేకు శాసనం దొరికిన నేపథ్యంలో, ఈ రెండు  ఆధారాలు నగర చరిత్రకు అద్దంపడుతున్నాయని శివనాగిరెడ్డి అన్నారు.