బీజేపీలో మోడీ ముసలం పదిలం

 

భారతీయ జనతాపార్టీలో నరేంద్ర మోడీ విషయమై ఇంకా కల్లోలం చెలరేగుతూనే ఉంది. ఆయన తన గుజరాత్ కంచుకోట లోంచి బయటకి వచ్చి దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీని బలపరచడానికి కృషి చేస్తుంటే, పార్టీలో ఆయనను వ్యతిరేఖించేవారు చాప క్రింద నీరులా తమపని తాము చేసుకొనిపోతున్నారు.

 

ఆ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు శత్రుఘన్ సిన్హా తమ పార్టీకి, ముఖ్యంగా మోడీకి బద్ధ శత్రువయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తారు. “నితీష్ కుమార్ సారధ్యంలో బీహార్ రాష్ట్రం అద్భుతమయిన ప్రగతి సాధిస్తోందని, ఆయన వంటి సమర్ధుడు దేశప్రధాని పదవి ఆశించడంలో తప్పు లేదని, ఆయన ప్రధాని పదవికి అన్ని విధాల సమర్ధుడు, అర్హుడు” అంటూ పొగిడేశారు.

 

నరేంద్ర మోడీని సాకుగా చూపి బీజేపీ సారద్యంలో నడుస్తున్న ఎన్డీయే కూటమి నుండి నితీష్ కుమార్ కి చెందిన జేడీ (యు) వైదొలగిన నాటినుండి ఆయనపై విరుచుకుపడుతున్నబీజేపీకి, తమ పార్టీ సీనియర్ నేతే ఈవిధంగా శత్రువును పొగడటం మింగుడు పడటం లేదు. అందువల్ల శత్రుఘన్ సిన్హాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం సిద్దపడుతోంది. బహుశః సిన్హా కూడా సరిగ్గా అదే ఆశిస్తూ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.

 

బీహార్ రాష్ట్రానికే చెందిన ఆయన ఒకవేళ జేడీ(యు) పార్టీలోకి మారే ఆలోచనతో నితీష్ కుమార్ ని పొగిడి ఉండవచ్చును. లేదా, మోడీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న అద్వానీ వర్గానికి చెందిన సిన్హాను అద్వానీయే వెనుక నుండి ఆవిధంగా మాట్లాడేందుకు ప్రేరేపించి ఉండవచ్చును. మోడీ కోసం నితీష్ కుమార్ వదులుకొని పార్టీ పెద్ద తప్పు చేసిందని దృడంగా నమ్ముతున్న అద్వానీ వర్గం, సిన్హా ద్వారా పార్టీలో ఒక కొత్త చర్చ లేవదీసే ప్రయత్నం చేసి ఉండవచ్చును. ఒకవేళ సిన్హా మీద పార్టీ వేటువేస్తే అద్వానీ వర్గం ఇదే అదునుగా చేసుకొని మోడీని వ్యతిరేఖిస్తూ మళ్ళీ తిరుగుబాటు జెండా ఎగురవేసే అవకాశం ఉంది. రానున్న ఎన్నికలలోగా పార్టీ చేత మోడీ పేరును ఎలాగయినా పక్కన పెట్టించాలని తీవ్రంగా పరితపిస్తున్న అద్వానీ వర్గం ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండవచ్చును.

 

అయితే, దీనివల్ల ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగవచ్చును. రానున్న సాదారణ ఎన్నికలలో భారీ మెజార్టీతో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమాగ చెపుతున్న అద్వానీ, మోడీకి వ్యతిరేఖంగా ఈవిధంగా ముసుగులో గుద్దులాతలు కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ ని కష్టపెట్టకుండా బీజేపీ తనను తానే ఓడించుకోవడం మాత్రం ఖాయం.