యుద్ధ వీరులకు నమ్మకద్రోహం- ఆదర్శ్‌ కుంభకోణం!

 

1999- కార్గిల్‌ యుద్ధం! తీవ్రవాదుల సాయంతో పాకిస్తాన్‌ తీసిన ఆ దొంగదెబ్బ నుంచి కోలుకునేందుకు మన దేశానికి చాలా సమయమే పట్టింది. ఊహించని ఆ దాడిని తిప్పికొట్టే దశలో మన సైన్యం భారీగానే నష్టపోయింది. కార్గిల్‌ యుద్ధ సమయంలో తమ సత్తాని చాటిన వీరులకు, కార్గిల్ యుద్ధ వితంతువులకు ఏదన్నా చేస్తే బాగుండు అని భారతీయ సమాజం ఆశించింది. అందుకని, వారి కోసం ఇళ్లు కట్టించి ఇస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాగానే మురిసిపోయింది. కానీ కార్గిల్ యుద్ధ వితంతువుల పేరుతో మన నేతలు మరింత లాభపడే ప్రయత్నం చేశారని తెలుసుకుని విస్తుపోక తప్పలేదు. వీరులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి తమ బంధుగణాన్ని మేపిన నేతల చేతల్ని చూసి దేశం సిగ్గుపడింది. పాకిస్తాన్‌ అంటే ఏదో శత్రు దేశం అనుకోవచ్చు. కానీ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నేతలే అమర వీరుల పేరుతో మోసం చేయాలని చూస్తే! ఆ వెన్నుపోటు పేరే ఆదర్శ కుంభకోణం. కుంభకోణాలన్నింటికీ ఆదర్శంగా నిలిచిన ఈ నేరం కథ ఇదీ...

 

కొలాబా- ముంబైలోని అతి ఖరీదైన ప్రాంతాల్లో ఇది ముందుంటుంది. నారిమన్‌ పాయింట్‌ వంటి వ్యాపార కేంద్రానికి దగ్గరగా, సముద్ర తీరం కనిపించేలా ఉండే కొలాబాలో నివసించేందుకు ధనికులంతా ఉవ్వళ్లూరుతూ ఉంటారు. అలాంటి కొలాబాలో కార్గిల్ వీరులకు, యుద్ధ వితంతువులకు ఒక గృహ సముదాయాన్ని నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. అందుకోసం తన కింద ఉన్న వేల గజాల స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న తంత్రాలు కనిపించసాగాయి. తొలుత ఆరు అంతస్తులు అని చెప్పి మొదలుపెట్టిన ఈ భవంతిని ఏకంగా 31 అంతస్తులకు పెంచి పారేసింది. ఆదర్శ్‌ కో-అపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ పేరుతో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించసాగారు అధికారంలో ఉన్న నేతలు. కనీసం ఆరు కోట్లు విలువ చేసే ఫ్లాట్లను, అయిన వారికి ఆదర్శ పేరటి అరవై లక్షలకే అందించే పథకానికి తెరతీశారు.

 

ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న నిజాలు విస్తుపోయేలా చేశాయి. ఆదర్శ్ గృహసముదాయంలోని ఇళ్లు ఎవరెవరికి కేటాయించారో తెలుసుకున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ అత్తగారితో సహా నలుగురు బంధువులకు అందులో ఫ్లాట్లను కేటాయించారు. కేవలం అశోక్‌ చవాన్‌ మాత్రమే కాదు. ఆదర్శ గృహ యజమానుల జాబితాలో యాభై శాతానికి పైగా అధికారులు, రాజకీయ నాయకులు, వారి బంధుగణాల పేర్లే కనిపించాయి. పోనీ యుద్ధ వీరులకైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు! పలుకుబడి ఉన్న సైన్యాధికారులకు మాత్రమే కొన్ని ఇళ్లని అందించారు. ఆఖరికి నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, తమకు కావల్సిన అనుమతులు ఇచ్చిన అధికారులకు కూడా తలా ఓ ఫ్లాటు బహుమతిగా అందించేశారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు ముఖ్యమంత్రుల బంధువుల పేర్లు ఇందులో కనిపించాయంటే ఫ్లాట్ల కేటాయింపు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా సాగిన ఈ అక్రమంలో ప్రస్తుత రైల్వే మంత్రి సురేష్‌ప్రభుగారికి కూడా ఉదారంగా ఓ ఇంటిని అందించారు.

 

ఆదర్శ్‌ గృహాలను కేటాయించడంలో ఎలాగూ అక్రమాలు జరిగాయని తేలిపోయింది. కనీసం ఆ గృహ సముదాయాన్ని నిర్మించడంలో అన్నా నిబంధనలు పాటించారా అంటే అదీ లేదు! ఆ ప్రాంతంలో కేవలం ఆరు అంతస్తుల భవంతిని మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా, ఏకంగా 31 అంతస్తుల భవనాన్ని కట్టిపారేశారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతులను ఏమాత్రం తీసుకోలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రక్షణ శాఖకు చెందిన కార్యాలయాలు ఉన్న చోట 100 మీటర్ల భవంతిని కట్టడం ఏమిటంటూ నౌకాదళం చేసిన అభ్యంతరాలను కూడా ఖాతరు చేయలేదు.

 

2010 నాటికి ఆదర్శ్‌ కుంభకోణం ముదరడంతో అప్పటి ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ రాజినామా చేయక తప్పలేదు. కానీ అశోక్‌ తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన పృథ్విరాజ్ చవాన్‌ కూడా ఈ కుంభకోణాన్ని చల్లార్చేందుకే ప్రయత్నించారు. ఏదో కంటి తుడుపు చర్యలుగా విచారణ సంఘాలను నియమించడం, ఆ విచారణ సంఘాలు అందించిన నివేదిలను పక్కన పారేడం లాంటి చిత్రాలు చాలానే చేసేందుకు ప్రయత్నించారు. దీంతో హైకోర్టు కల్పించుకుని స్వయంగా సీబీఐ దర్యాప్తుని పర్యవేక్షించడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా నేతలు తమ బుద్ధులను పోనిచ్చుకోలేదు. కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను మాయం చేసి పారేశారు. కానీ ఎందరు ఎన్ని జిమ్మక్కులు చేసినా ముంబై నడిబొడ్డున తమ అక్రమాలకు సాక్ష్యంగా ఉన్న 300 అడుగుల ఎత్తైన ఆదర్శ్‌ భవంతిని మాత్రం మాయం చేయలేకపోయారు.

 

ఆదర్శ్‌ కుంభకోణంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అక్రమాల మీద హైకోర్టు నిన్న కొరడా ఝుళిపించింది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ఎగతాళిగా నిలిచిన ఆదర్శ భవనాన్ని కూల్చివేయాలని నిర్మొహమాటంగా ఆదేశించింది. అంతేకాదు! ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న అధికారులందరినీ కూడా విడిచిపెట్టవద్దంటూ ప్రభుత్వాలను ఆదేశించింది. కానీ నిందితుల తరఫు న్యాయవాదులు సుప్రీం తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, కోర్టు ఆదేశాలు ఏమేరకు అమలవుతాయో వేచిచూడాలి. ఈ లోపల ఎలాగూ మరో కుంభకోణం బయటపడక తప్పదు! జనం, పత్రికలు కొత్తగా మరో నేతను తిట్టుకోకా తప్పదు!