వేం నరేందర్ రెడ్డి డ్రైవర్లని ప్రశ్నిస్తున్న ఏసిబి అధికారులు

 

ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారులు తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ వరుసగా రెండు రోజులు ప్రశ్నించిన తరువాత ఈరోజు ఆయన ఇద్దరు డ్రైవర్లని ప్రశ్నిస్తున్నారు. వారిరువురికి కూడా సెక్షన్: 160సి.ఆర్.పి.సి క్రింద నోటీసులు జారీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే వారివురు వేం నరేందర్ రెడ్డికి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు తప్ప వారికి ఈ ఓటుకి నోటు కేసులో నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా సమాచారం లేదు. అంటే ఈ కేసులో వారిరురు కేవలం సాక్షులు మాత్రమేనని అర్ధమవుతోంది. అటువంటప్పుడు వారికి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే వీలు కల్పించే సెక్షన్: 160 క్రింద నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సండ్ర వెంకట వీరయ్యను విడుదల చేసాక మొదట కృష్ణ కీర్తన్ కి, ఆ తరువాత వేం నరేందర్ రెడ్డి యొక్క ఇరువురు కారు డ్రైవర్లకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు. బహుశః ఈ కేసును వీలయినంత కాలం కొనసాగిస్తూ తెదేపాని నిరంతర ఒత్తిడికి గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.