Latest News

న్యాయపోరాటంలో ఏబీవీ విజయం చారిత్రాత్మకం

posted on: Jun 16, 2022 11:14AM

కోర్టు మొట్టికాయలతో జగన్ తలంతా బొప్పి కట్టేసింది. అయినా ఆయన వైఖరి కానీ, ప్రభుత్వ వైఖరి కానీ మారడం లేదు. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా.. జగన్ సర్కార్  అందులో కొర్రీల గురించి వెతుకులాడుతూ తీర్పు అమలును ఉద్దేశ పూర్వకంగా తాత్సారం చేస్తున్నది. అదలా ఉంచితే.. తాజాగా జగన్ సర్కార్ పై కోర్టు మరో సారి అక్షింతలు వేసింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులను చీవాట్లు పెట్టింది. ఉపాధి బిల్లుల చెల్లింపులో కోర్టు ఆదేశాలను ధిక్కరించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసులో కోర్టుకు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, కోన శశిధర్ లపై ప్రశ్నల వర్షం కురిపించింది. కర్నూలు జిల్లాలో కాంట్రాక్టర్ ఆత్మహత్య పై కోర్టు ఐఏఎస్ అధికారులను నిలదీసింది. ప్రభుత్వం సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారనీ, ఆ కుటుంబానికి ఎవరు ఆసరా, భరోసా కల్పిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రతి కోర్టు ఆదేశంలోనూ కోర్టు ధిక్కరణ కేసులను ఫేస్ చేయాల్సి రావడం దేనికి సంకేతమని గట్టిగా అడిగింది.  గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరిగిన చెల్లింపుల స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.

డబ్బులు అప్పు తీసుకొచ్చి పనులు చేసినప్పుడు వారికి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.  ఇలా అయితే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించంది.కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. కోర్టు నిలదీసినట్లుగానే ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవగతమౌతుంది. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అయితే ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. కోర్టు తీర్పు మేరకు తక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వడంలో అలవిమాలిన నిర్లక్ష్య వైఖరిని, అహంభావ పూరిత వైఖరిని అవలంబించింది.

కోర్టు ధిక్కరణ అభియోగం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అనివార్యంగా, తప్పని సరి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. అదీ పనిష్మెంట్ పోస్టింగ్ గా అంతా భావించే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ కమిషనర్ గా ఈ పోస్టులో పనీ ఉండదు, అధికారాలూ ఉండవని ప్రతీతి. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం మెడలు వంచి, తనకు తిరిగి పోస్టింగ్ వచ్చేలా చేసుకోవడానికి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన న్యాయ పోరాటం మాత్రం పోలీసు చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనిది.    

రెండేళ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసిన ఏబీవీకి ఎట్టకేలకు న్యాయం జరిగింది.  ఇక తప్పించుకోవడానికి అవకాశం లేని తప్పని సరిపరిస్థితుల్లో ప్రభుత్వం ఆయనను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇచ్చింది. గత్యంతరం లేక ప్రభుత్వం ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చిందనీ,  అటువంటి పరిస్థితుల్లో ఏబీవీకి   అప్రాధాన్యపరమైన పోస్టింగు మాత్రమే దక్కుతుందని, ముందు నుంచీ ఊహించినదేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  కాగా ఇప్పటివరకూ మూడుసార్లు సీఎస్ వద్దకు వెళ్లి  తన పోస్టింగు అంశంపై లేఖ ఇచ్చినా   స్పందన కనిపించకపోవడంతో..  ఇక ఒకటిరెండు రోజుల్లో సీఎస్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమైన తరుణంలో ఏబీకి పోస్టింగ్ దక్కడం విశేషం.  ఒకటి రెండు రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు విధుల్లో చేరే అవకాశం ఉందంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...