అబ్దుల్ కలాం జీవిత విశేషాలు-1

 

సోమవారం నాడు కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా గడిచింది. జీవితంలో చివరి క్షణం వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఆయన తాను నిరంతర శ్రామికుడినని నిరూపించారు. నిరంతరం శ్రమించండి అని ఈ దేశానికి తన మరణం ద్వారా కూడా సందేశాన్ని ఇచ్చారు. అబ్దుల్ కలాం భారత దేశానికి 11వ రాష్ట్రపతి. జూలై 25, 2002 – జూలై 25, 2007 మధ్య ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద వున్న ధనుష్కోడిలో ఆయన అక్టోబరు 15, 1931. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్న ఆయన దేశంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించి, క్షిపణి శాస్త్రవేత్తగా తన ఆధ్వర్యంలోనే భారత ప్రభుత్వం అణు పరీక్షలు జరిపే స్థాయికి ఎదిగారు. అందరూ ఏపీజే అబ్దుల్ కలాంగా పిలిచే ఆయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. ఆయననను భారతీయ మిస్సైల్ మాన్ అని పిలుస్తారు. కలాం బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశం జరిపిన పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును కూడా అందుకున్నారు. అబ్దుల్ కలాం బ్రహ్మచారి.