కష్టాలలో కూడా అనుభవం, అవకాశాలనే చూసిన కలాం!

 

జీవితంలో చాలా చిన్న చిన్న పరిచయాలు, సంఘటనలు, అవకాశాలు, అనుభవాల నుండే ఆయన పాఠాలు నేర్చుకొంటూ సమున్నత శిఖరాలు అధిరోహించడమే కాకుండా విద్యార్ధులను, ప్రజలను కూడా ఆయన నిత్యం ప్రేపించేవారు. మొదట తండ్రి జైనులాబ్దీన్ దగ్గర అన్ని మతాలను గౌరవించడం నేర్చుకొన్నారు. జీవితంలో కష్టసుఖాలను ఒకే దృష్టితో ఏవిధంగా స్వీకరించాలో తల్లి హాజీ అమ్మాళ్ వద్ద నేర్చుకొన్నారు. కలాం తన బావగారు అహ్మద్ జలాలుద్దీన్ ప్రోత్సాహంతో ఇంగ్లీషు నేర్చుకొన్నారు. రోజూ న్యూస్ పేపర్లు వేసే తన దగ్గర బందువు షంషుద్దీన్ తో కలిసి కలాం కూడా పేపర్లు పంచుతూ వాటి నుండి లోక జ్ఞానం సంపాదించుకొన్నారు.

 

రామేశ్వరం ఆలయంలో ప్రధాన అర్చకుడు లక్షణ శాస్త్రి కుటుంబంతో తన తండ్రికున్న అనుబందం వలన హిందూ మతం గొప్పదనం గురించి తెలుసుకొన్నారు. ఆయన కుమారుడు రామనాధ శాస్త్రి, మరో ఇద్దరు చిన్ననాటి స్నేహితుల వలన హిందూ పురాణాలు, భగవద్గీత గురించి తెలుసుకొన్నారు. ఆయనకి అత్యంత ఇష్టమయిన గ్రందాలు భగవద్గీత, తిరుక్కురళ్.

 

కళాశాలలో చదువుకొంటున్నప్పుడు అబ్దుల కలాంలో దాగిఉన్న ప్రతిభని గుర్తించిన సైన్స్ ఉపాద్యాయుడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాం ని ఎంతగానో ప్రోత్సహించేవారు. నిజానికి ఆయన ప్రేరణ కారణంగానే కలాంలో సైంటిస్ట్ కావాలనే తపన రగిలింది. ఆ తరువాత కలాం అదృష్టం కొద్దీ హైస్కూలులో కూడా ఆయనను ప్రోత్సహించే గురువే దొరికారు. రామనాధపురం స్కూల్లో ఇయడురై సోలమన్ అనే ఉపాద్యాయుడు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేఅరణ కలాం జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆయన చెప్పిన మాట “ఆత్మ విశ్వాసం ఉంటే నువ్వు నీ విధి వ్రాతను కూడా తిరిగి రాయగలవు,” విద్యార్ధులకు కూడా చెపుతుండేవారు.

 

మద్రాస్ ఐ.ఐ.టి.లో చేరేందుకు ఆయన వద్ద డబ్బులు లేకపోతే ఆయన సోదరి జోహారా తనకున్న కొద్దిపాటి బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఆయనకిచ్చి ప్రోత్సహించింది. కలాం తనకు అత్యంత ఇష్టమయిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకొన్నారు. మళ్ళీ అక్కడా నరసింగరావు, కెఏవి పండల, స్పాండర్ అనే ముగ్గురు గురువులు ఆయనలో వైమానిక రంగంలో ఉన్న అభిరుచిని గుర్తించి ఆయనకి ఆ రంగంలో నిష్ణాతుడిగా ఎదిగేందుకు చక్కటి మార్గదర్శనం చేసారు. ఆవిధంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్ గా ఎదిగారు.

 

ఈ ప్రపంచంలో మనుషులు అందరికీ సమస్యలు ఉంటాయి..కష్టాలు ఉంటాయి వాటితో బాటే అవకాశాలు కూడా ఉంటాయి. సమస్యలను చూసి భయపడిపోకుండా వాటి నుండే జీవిత పాఠాలు నేర్చుకోవాలని, వాటినే సోపానాలుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదగాలని, అందరికీ ప్రేరణగా నిలవాలని అబ్దుల్ కలాం నిరూపించి చూపారు. నేడు ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలకి వడ్డించిన విస్తరిలాంటి జీవితాన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా ఏదో తక్కువయిందని, ఇంకా ఏదోలేదని నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారు. అటువంటి వారికి కలాం జీవితచరిత్ర చదివితే తమ జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఇంకా ఎంత ఎత్తుకు ఎదగవచ్చో తెలుసుకోవచ్చును.