TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్‌కళ్యాణ్‌ మీద ‘ఆగడు’ మహేష్ సెటైర్లు

Published on: Sat May 31, 2014 9:03AM

 

మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు అదిరిపోయేలా వున్న టీజర్ చూసి పండగ చేసుకుంటున్నారు. టీజర్‌లో వినిపించిన ‘స్పెషల్ కామెంట్లు’ విని రెచ్చిపోతున్నారు. అయితే ఈ టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం బిత్తరపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మహేష్‌బాబు తమ హీరో పవన్ కళ్యాణ్‌ మీద ఎందుకు పడ్డాడా అని ఆలోచించీ ఆలోచించీ వాళ్ళ బుర్రలు హీటెక్కిపోతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ‘ఆగడు’ టీజర్‌లో మహేష్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. టీజర్ మొదలవటం మొదలవటమే ‘‘సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా వుంది’’ అని మహేష్ చెబుతాడు. ఈ కామెంట్ ఎవర్ని ఉద్దేశించి అన్నాడా అని జనం ఆలోచనలో వుండగానే మరో పవర్ ఫుల్ డైలాగ్ మహేష్ నోట్లోంచి బయటకి వస్తుంది. ‘‘ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతోటి ఎదవ కంపారిజన్... ఎలపరం వచ్చేస్తంది’’ అంటాడు. దాంతో మహేష్‌బాబు ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశాడని అందరికీ అర్థమైపోయి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ తనని సింహంతో పోల్చుకుంటూ చెప్పిన పంచ్ డైలాగ్‌ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ ‘ఆగడు’ టీజర్ ఈ డైలాగ్ మీద, పవన్ కళ్యాణ్ మీద సైటైర్లు విసిరినట్టుగా వుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారు. సాటి హీరో మీద, సాటి హీరో సినిమా మీద మహేష్ ఇలా సెటైర్లు విసరడం న్యాయం కాదని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు. తన సినిమాలలో ఎవరో ఒక సినిమా వ్యక్తి మీద కామెంట్లు చేసే శ్రీను వైట్ల తన దుష్ట సంప్రదాయాన్ని ‘ఆగడు’లో కూడా కొనసాగించారని, అయితే దీనికి మహేష్ బాబు మద్దతు ఇవ్వడం మాత్రం అన్యాయమని బాధపడుతున్నారు.